శ్రమకు తగ్గ ఫలితం ఏదీ..? (కర్నూలు)

Date:13/10/2018
కర్నూలు ముచ్చట్లు:
సేద్యం అచ్చిరాక అన్నదాత అష్టకష్టాలు పడుతున్నాడు. అతివృష్టి, అనావృష్టితో కూడిన ప్రకృతి వైపరీత్యాలు అడుగడుగునా దెబ్బతీస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులను తట్టుకుని పంటలు పండించితే గిట్టుబాటు ధరలుండవు. ఆరుగాలం శ్రమ బూడిదలో పోసిన పన్నీరులా కష్టానికి తగ్గ ఫలితం దక్కడంలేదు. కర్షక నిర్వేదం అంతుచిక్కడం లేదు. జిల్లాలో రైతన్నలు పొలం పనులతోపాటు అధికారుల చుట్టూ  ప్రదిక్షిణలు చేస్తుండగా అధికారులు వివరాల నమోదు, సాంకేతిక సర్దుబాట్లలో తలమునకలవుతున్నారు.
రబీ సాగుకు విత్తన పంపిణీ చేస్తూనే ఈ ఏడాది వర్షాబావ పరిస్థితుల కారణంగా పంట నష్టపోయిన రైతుల వివరాల నమోదు, ఆన్‌లైన్‌ ప్రక్రియ, ఈ పంట నమోదు, గత ఏడాది రబీలో జొన్న, మొక్కజొన్న రైతులకు ప్రైస్‌ సబ్‌బెన్షన్‌ పథకం ద్వారా అందాల్సిన పరిహారంలో సాంకేతిక సమస్యల కారణంగా పరిహారం మంజూరుకాని రైతులు, 2017, నవంబరులో అధిక వర్షాలు, 2017-18 మార్చి-ఏప్రిల్‌లో వడగండ్ల వానల కారణంగా పంట నష్టపోయిన రైతులకు మంజూరైన పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సీఎఫ్‌ఎంఎస్‌ కోడ్‌ తయారీ, ఈ పంట నమోదు పనుల్లో వ్యవసాయ అధికారుల బిజీ అయ్యారు.
ఈ ఏడాది నుంచి రైతుకు సీఎఫ్‌ఎంఎస్‌ కోడ్‌ జనరేట్‌ చేస్తున్నారు. ఇక నుంచి రైతు బ్యాంకు ఖాతా మార్చకూడదు. రైతు ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతాకు అనుసంధానిస్తూ కొత్తగా సీఎఫ్‌ఎంఎస్‌ కోడ్‌ను రూపొందిస్తున్నారు. ఇది రైతు శాశ్వత ఖాతా సంఖ్యగా నమోదవుతుంది. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అందించే నష్ట పరిహారం సొమ్ము శాశ్వత రైతు ఖాతాలకు చేరనుంది. 2017-18 ఏడాదిలో పరిహారం మంజూరైన రైతుల పేరుమీద శాశ్వత ఖాతా సంఖ్యను రూపొందిస్తున్నారు. భవిష్యత్‌లో రైతులు పదేపదే బ్యాంకు ఖాతాలు మార్చేందుకు వీలుండదు.
ఒకే ఖాతా సంఖ్యపై ఇద్దరు ముగ్గురు కుటుంబ సభ్యుల పేర్ల మీద రైతులు పరిహారం తీసుకోడానికి వీలుండదు. కర్షకులు బ్యాంకు ఖాతా మారిస్తే భవిష్యత్తులో పరిహారాల మంజూరుకు ఇబ్బంది పడాల్సి ఉంటుంది.2017, నవంబరులో అధిక వర్షాలు, 2017-18 మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో వడగండ్ల వానల కారణంగా రైతుల పంటల నష్టపోయారు. 2017, నవంబరులో అధిక వర్షాల కారణంగా జిల్లాలో 35 మండలాల పరిధిలో 31,010 మంది రైతులకు 21,708 హెక్టార్లకు రూ.30,68,11,144 మంజూరయ్యాయి. 2017-18లో వడగండ్ల వానల కారణంగా నాలుగు వ్యవసాయ డివిజన్‌ల్లో రూ.1,59,06,965 మంజూరయ్యాయి. రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు వారి ఆధార్‌, బ్యాంకు ఖాతాలకు సీఎఫ్‌ఎమ్‌ఎస్‌ కోడ్‌ను అనుసంధానం చేస్తున్నారు.
ఈ ఏడాది పంట నష్టపరిహారం అందాలంటే రైతు తప్పనిసరిగా ఈ-పంట నమోదు చేయించుకోవాలి. జిల్లా సాధారణ సాగు 6.35 లక్షల హెక్టార్లు కాగా ఈ ఏడాది 6,12,841 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. జిల్లాలో అక్టోబర్‌ 5వ తేదీ నాటికి 85 శాతం అనగా 5,21,501 హెక్టార్లలో ఈ పంట నమోదైంది. ప్రభుత్వం పంట నష్టపరిహారానికి ఈ-పంట నమోదు తప్పనిసరి చేయడంతో ఈ నమోదులో వ్యవసాయ సిబ్బంది బిజీ అయ్యారు. గడువు లోపు తమ పంట నమోదు చేస్తారో లేదోనన్న ఆందోళనలో రైతన్నలు ఉన్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు నష్టపోయిన రైతుల నమోదు కార్యక్రమం కొనసాగుతోంది.
జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా జులై 31 నాటికి 2,19,132 హెక్టార్లలో 2.75 లక్షల మంది రైతులకు పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. రూ.295 కోట్లు పరిహారం కోసం ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో మొదట విడతలో 37 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించారు. జులై 31 నాటికి నష్టపోయిన రైతుల వివరాలు సేకరించారు. రెండో విడతలో ఆగస్టులో 12 మండలాలను చేర్చారు.
సెప్టెంబర్‌లో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు మళ్లీ నష్టపోవడంతో సెప్టెంబర్‌ 31 వరకు జిల్లా సర్వోన్నతాధికారి ఆదేశించడంతో రైతుల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. డివిజన్ల స్థాయిలో ఈనెల 7 లోపు పూర్తిచేసి 8వ తేదీ జిల్లా ఉన్నతాధికారులకు నివేదికలు అంజేయాల్సి ఉండటంతో సిబ్బంది కసరత్తు చేస్తున్నారు. గత ఏడాది పరిహారం ఇప్పుడు మంజూరైనందున ప్రస్తుతం నష్టపోయిన రైతుల పరిహారం ఎప్పుడిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
Tags:What is the result of labor? (Real Estate)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *