సీటు దక్కకుంటే ఏం చేస్తారు…?

Date:26/04/2019
ఒంగోలు ముచ్చట్లు:
సీటు దక్కకుంటే ఏం చేస్తారు…? వెంటనే పార్టీ మారతారు. ఈరోజుల్లో రాజకీయనేతలు చేసే మొట్ట మొదటిపని అదే. తమ రాజకీయ జీవితం ఐదేళ్లు బుగ్గిపాలు కాకూడదన్న ఏకైక లక్ష్యంతో రాజకీయ నేతలదంరూ పార్టీని మారేందుకు ఏమాత్రం వెనకంజ వేయరు. నామినేషన్ చివరి రోజు కూడా పార్టీ మారి బీఫారం తీసుకున్న నేతలను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చూశాం. గెలుస్తామనుకునే పార్టీకే ఎక్కువ మంది వెళుతుంటారు. అది సహజం. కానీ మనం ఇప్పుడు చెప్పుకోబేయే నేత విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్న లీడర్. ఆయనే జంకె వెంకటరెడ్డి. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా. ఆయన ఇతర నేతలకు భిన్నంగా వ్యవహరించిన తీరు ఇప్పుడు ప్రశంసలను అందుకుంటుంది.జంకె వెంకటరెడ్డి. మార్కాపురం నియోజకవర్గంలో నిన్న మొన్నటి దాకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే. ప్రజల్లో మంచి పేరుంది. గత ఎన్నికల్లో గెలిచిన ఆయన ఆపరేషన్ ఆకర్ష్ కు లొంగిపోకుండా పార్టీలోనే ఉండిపోయారు.పార్టీని నమ్ముకున్న వ్యక్తికి జగన్ ఖచ్చితంగా టిక్కెట్ ఇస్తారనుకుంటారు. కానీ జంకె వెంకటరెడ్డి విషయంలో అది సాధ్యపడలేదు. జంకె వెంకటరెడ్డికి ప్రకాశం జిల్లాలోనే సౌమ్యుడనే పేరుంది. నియోజకవర్గంలో మంచి పట్టుంది. కానీ జగన్ ఆయనను ఈసారి పక్కన పెట్టారు. మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి తనయుడు నాగార్జున రెడ్డికి టిక్కెట్ కేటాయించారు.ఇతర నేతలెవరైనా వెంటనే పార్టీని వీడేందుకు సిద్ధమవుతారు. కానీ జంకె అలాచేయలేదు. మనస్ఫూర్తిగా నాగార్జున రెడ్డి విజయానికి కృషి చేశారు.
నాగార్జున తండ్రి కేపీ కొండారెడ్డి గత ఎన్నికలలో తనకు అండగా నిలిచిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ ఎన్నికలలో సీటు దక్కకపోయినా వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారు. జగన్ ముఖ్యమంత్రి కావాలన్నదే తన లక్ష్యమని, తనకు టిక్కెట్ రాకపోయినా పరవాలేదని అసంతృప్తిగా ఉన్న తన సన్నిహితులను వారించారు జంకె వెంకటరెడ్డి. మార్కాపురం నియోజకవర్గంలో జంకె వెంకటరెడ్డి, కేపీ కొండారెడ్డిలు కలిస్తే విజయం ఏకపక్షమవుతుందని అందరికీ తెలిసిందే.జంకెకు టిక్కెట్ రాకపోవడంతో ఆయన వైసీపీకి మద్దతివ్వరని, తమ గెలుపు సులువవుతుందని వేసుకున్న టీడీపీ అంచనాలు తలకిందులయ్యాయి. అభ్యర్థి కన్నా ఎక్కువగా జంకె వెంకటరెడ్డి కష్టపడటం చూసి ఆయన అనుచరులే ఆశ్చర్యపోయారట. జంకె వెంకటరెడ్డికి మార్కాపురం పట్టణంలో అధికంగా ఉన్న వైశ్య సామాజికవర్గం ఎప్పటి నుంచో మద్దతుగా ఉంది. ఈసారి జంకెకు టిక్కెట్ ఇవ్వకున్నా వారితో సమాలోచనలు జరిపి ఆ ఓట్లను వైసీపీ వైపునకు మలచగలిగారంటున్నారు. తనకు పట్టున్న మార్కాపురం, కొనకనమిట్ట మండలాల్లోనూ జంకె ఓటు బ్యాంకును వైసీపీ ఖాతాలో వేయగలిగారు. ఇలా తనకు సీటు దక్కకున్నా మనస్ఫూర్తిగా పార్టీ కోసం పనిచేసిన జంకెను చూసి పార్టీ నేతలు రెండు చేతులెత్తీ నమస్కారం పెట్టలేకుండా ఉండలేకపోతున్నారట. ఆయనను అరుదైన నేతగా అభివర్ణిస్తున్నారు.
Tags:What would you do if you got a seat?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *