సీఎం సంగతి సరే…మంత్రులు ఏం చేస్తున్నారు….

 Date:15/08/2018
విజయవాడ ముచ్చట్లు:
ప్రభుత్వం సాధించిన విజయాలు., అందిస్తోన్న సంక్షేమ పథకాలు., సంతృప్తికర స్థాయిలో పథకాల అమలు చేయడం ప్రభుత్వం లక్ష్యం. అయితే ఈ లక్ష్యం అయా శాఖల బాధ్యులు., అధికారుల తీరుతో దెబ్బతింటోంది. ప్రతి శాఖకు సంబంధించి సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన వ్యవస్థలు తమకెందుకని మిన్నకుండిపోవడమే సమస్యగా మారుతోంది. ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, సాధించిన విజయాలకు సంబంధించిన కనీస వివరాలు కూడా అయా శాఖల వద్ద అందుబాటులో ఉండటం లేదు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రతి మంత్రిత్వ శాఖలో పబ్లిక్ రిలేషన్ వ్యవస్థల్ని ఏర్పాటు చేశారు. అయా శాఖల ద్వారా చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు., లబ్దిదారులు., సాధించిన ప్రగతి నివేదికల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా సమన్వయం చేయడం వీరి బాధ్యత… ఒక్క శాఖలో కూడా సమర్ధవంతంగా పబ్లిక్ రిలేషన్ వ్యవస్థ పనిచేస్తున్న దాఖలాలు లేవు. అయా శాఖల మంత్రులకు సంబంధించిన అమలు చేస్తున్న పథకాల వివరాలను కూడా చెప్పలేని పరిస్థితి కొన్ని శాఖల్లో ఉంది.ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించాల్సిందే తప్ప అయా శాఖల మంత్రులు తమకేం పట్టనట్టు వ్యవహరించడం మరో సమస్య…. కొన్ని మంత్రిత్వ శాఖలు-
వాటికి అనుబంధంగా ఉండే కార్పొరేషన్లకు మధ్య కూడా సమన్వయం లేదు. ఎవరికి వారు తమదే పై చేయిగా ఉండాలని భావించడం కూడా సమస్యలకు దారి తీస్తోంది. మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న ప్రతి కార్పొరేషన్ స్వతంత్రంగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తుండటం., మంత్రులు- కార్పొరేషన్ ఛైర్మన్ ల మధ్య సఖ్యత కొరవడం కూడా కారణమవుతోంది. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు విస్త్రత ప్రచారం కల్పించాలని ముఖ్యమంత్రి సూచిస్తున్నా అందుకు తగ్గ ప్రయత్నాలు మాత్రం జరగడం లేదు..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరుపదుల వయసు దాటిన ఉదయం లేచింది మొదలు రాత్రి పొద్దుపోయే వరకు నిరంతరం సమీక్షలు., సమావేశాలు., పర్యటనలతో బిజిబిజీగా గడుపుతుంటారు.
ఏకబిగిన గంటల కొద్ది సమావేశాలు., సమాలోచనలు జరుపుతూనే ఉంటారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు నిరంతరం శ్రమించే తీరు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగకమానదు. మరి ఆయన మంత్రి వర్గ సహచరులు., అధికారులు ఆ స్థాయిలోనే పనిచేస్తున్నారా అంటే మాత్రం సమాధానం కష్టం.విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు పనిచేసే తీరు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. రోజుకు 12 గంటలు తగ్గకుండా ఆయన పనిచేస్తూనే ఉంటారు. ఉదయం 7-8 గంటల మధ్య సీఎం షెడ్యూల్ మొదలవుతుంది.
ఆ షెడ్యూల్‌కు వారాంతాలు., విరామాలు ఉండవు. ఆదివారం., కుటుంబం పట్టవు. ఆరు పదుల వయసులో హాయిగా కుటుంబంతో గడపాల్సిన సమయంలో కూడా ఏదొక పని చేస్తూనే ఉంటారు. నాలుగేళ్ల క్రితం రాష్ట్ర విభజన తర్వాత బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ముందు అనేక సవాళ్లు నిలిచాయి. రాష్ట్రం ఇక్కడ., రాజధాని ఎక్కడ అన్న పరిస్థితిలో విజయవాడ తరలివచ్చారు. నాలుగేళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే స్పష్టమైన మార్పు వచ్చిందంటే దానికి కారణం చంద్ర బాబు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆయన శ్రమ., పట్టుదల., దార్శనికత వల్లే రాజధాని ఇప్పుడున్న స్థితిలో నిలవగలిగింది. ఇది నాణానికి ఓ వైపే…. ముఖ్యమంత్రిగా ఆయన పడే శ్రమ తపనలో కొంతైనా మిగిలిన వారిలో కనిపించదు.ఏపీ క్యాబినెట్‌లో చంద్రబాబు నాయుడుతో కలిపి 26మంది సహచరులు ఉన్నారు.
బీజీపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత పైడికొండల మాణిక్యాల రావు., కామినేని శ్రీనివాస్ లు రాజీనామాలు చేశారు. దీంతో మంత్రి వర్గం 24మందికి పరిమితమైంది. వీరిలో ఎంతమంది తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నారన్నది అసలు ప్రశ్న…. చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో ఉంటే దాదాపుగా సచివాలయానికి వస్తారు. పార్టీ కార్యక్రమాలు., జిల్లాలకు సంబంధించిన పార్టీ సమస్యలు ఉంటే మాత్రం ఇంటి వద్దే సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు.
సచివాలయ ఉద్యోగులు., హైదరాబాద్‌ నుంచి ప్రభుత్వ శాఖల సిబ్బందికి వారానికి ఐదు రోజుల పని విధానం అమలవుతున్నా ముఖ్యమంత్రి మాత్రం శనివారం సైతం సెక్రటేరియట్‌కు వచ్చిన సందర్భాలు కొకొల్లలు.ము‌ఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు పూర్తి భిన్నంగా ఉంటోంది మెజార్టీ మంత్రుల పనితీరు.ఎప్పుడొస్తారో ఎవరికి తెలీదు. వెలగపూడిలో సచివాలయం ప్రారంభించిన తొలినాళ్లలో మంత్రులు., ఉన్నతాధికారులు., శాఖాధిపతులు సమయపాలన లేకుండా ఇష్టానుసరం వ్యవహరిస్తుండటంతో బయోమెట్రిక్ హాజరును అందు బాటులోకి తీసుకువచ్చినా ఫలితం లేకుండా పోతోంది.
మంత్రి వర్గ సహచరుల్లో చాలామంది సొంత పనులు పూర్తి చేసుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొంత మంది మంత్రులైతే సొంత జిల్లాల నుంచి విజయవాడ వరకు వస్తారు కానీ పక్కనే ఉన్న సచివాలయంలోకి మాత్రం తొంగి చూడరు. కృష్ణా., గుంటూరు జిల్లాలకు చెందిన మంత్రులది మరో లెక్క.కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు సచివాలయంలో కనిపించడం అరుదు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి మాత్రమే అడపాదడపా సచివాలయంలో కనిపిస్తారు. ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి క్యాబినెట్ సమావేశం ఉంటే తప్ప ఆయన సెక్రటేరియట్‌లోకి రారు.
పశ్చిమకు చెందిన ఇద్దరు మంత్రులది ఇదే తీరు. రాయలసీమకు చెందిన మంత్రుల సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కారణాలు ఏవైనా సీమ జిల్లాల మంత్రులు మాత్రం వెలగపూడి వైపు కన్నెత్తి చూడటం లేదు.వారంలో కనీసం రెండు రోజులైనా సెక్రటేరియట్‌లో అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నా దానిని పాటించే వారు కరువయ్యారు. అమాత్యుల తీరు ఇలా ఉంటే ఇక ఆ శాఖల ఉన్నతాధికారులది మరో తీరు. ముఖ్యమంత్రి సెక్రటేరియట్‌కు రావడం లేదంటే వారికి పండగే….. గత వారం పదిరోజులుగా ముఖ్యమంత్రి వరుసగా జిల్లాలలో పర్యటిస్తున్నారు. గ్రామదర్శిని కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత అన్ని జిల్లాలలో క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
గత నెల 26న పశ్చిమ గోదావరి., 28న ఒంగోలు., 31న అనంతపురం., 1 విశాఖపట్నం., 3న కృష్ణా జిల్లాలలో గ్రామదర్శిని నిర్వహించారు. 4వ తేదీ శనివారం కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని పరామర్శించేందుకు చెన్నై వెళ్లారు. 7వ తేదీ ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్లారు. బుధవారం గ్రామదర్శిని నోడల్ అధికారులతో సమావేశం తర్వాత కరుణానిధి అంత్యక్రియలలో పాల్గోనేందుకు చెన్నై వెళ్లారు. అదే సమయంలో సచివాలయంలో ఏ శాఖలోను ఉన్నతాధికారులు కనిపించలేదు. వివిధ శాఖల కార్యదర్శులు గ్రామదర్శిని నోడల అధికారుల సమావేశానికి వెళ్లినా చాలామంది సీఎం ఎటూ రారు కాబట్టి సెలవు తీసుకున్నారు. మంత్రుల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు.
మంత్రులెవరైనా జిల్లా పర్యటనల్లో ఉంటారా ., పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటున్నారా అంటే అది ఉండదు. కొందరు మంత్రుల దర్శనానికి రోజుల తరబడి తిరిగితే తప్ప దర్శనం జరగదని సచివాలయంలోనైనా దొరుకుతారని అయా జిల్లాల నుంచి ప్రజలు సచివాలయం తరలిరావడం నిత్యకృత్యమైంది.కొత్తగా మంత్రి పదవులు వచ్చిన వారే కాదు., చాలామంది సీనియర్లు గతంలో మంత్రులుగా పనిచేసిన వారు సైతం సెక్రటేరియట్ వైపు వచ్చేందుకు పెద్దగా ఇష్టపడటం లేదనే వాదన ఉంది. వయసు రీత్యా కొందరు., ఆరోగ్య కారణాలతో మరికొందరు., ఇతరత్రా కారణాల వల్ల మరికొందరు సచివాలయానికి దూరంగా ఉండిపోతున్నారు.
ప్రభుత్వంపై విమర్శల్ని తిప్పి కొట్టే క్రమంలో మీడియా ముందుకు వచ్చేందుకు కూడా మంత్రులు అందుబాటులో ఉండటం లేదు. రోజూ ఒకరిద్దరు అధికార ప్రతినిధులు., సలహాదారులకే ఆ బాధ్యత అన్నట్లు సాగుతోంది. ప్రభుత్వాన్ని., పార్టీ వాదనను నిలబెట్టాల్సిన సమయంలో కూడా మంత్రులు కనిపించకుండా పోతున్నారు. ఇక కొందరైతే రోజుకో ప్రకటన., రెండ్రోజులకో ఖండన పంపి చేతులు దులుపుకుంటున్నారు.
దీంతో అన్ని బాధ్యతలు చంద్రబాబుకే చుట్టుకుంటున్నాయి. మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సిన సందర్భాలలో సైతం మంత్రులు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమైంది. ఇటీవలి కాలంలో బీజేపీ నేతలు దూకుడు పెరిగినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రులు మాత్రం కిమ్మనడం లేదు. సచివాలయంలో సాయంత్రానికి ఓ ప్రెస్ మీట్ పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు ఇబ్బందులు తప్పకపోవచ్చు.
Tags:What’s the matter … what are ministers doing ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *