అమ్మకు ఏదీ అండ?

Date:06/12/2018
ఏలూరు ముచ్చట్లు:
గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రాథమిక చికిత్స అందించడంతోపాటు సుఖప్రసవాలు జరిగేలా చూడడంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలది కీలక పాత్ర. రానురానూ ఈ పీహెచ్‌సీల ప్రభావం తగ్గిపోతోంది. అందుబాటులో వైద్యులు, వైద్యసిబ్బంది ఉండకపోవడం, ఉన్నా స్పందించే తీరు బాగుండక పోవడంతో గ్రామీణ ప్రజలు ప్రైవేటు బాట పడుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య దారుణంగా పడిపోతోంది. లక్ష్యంలో మూడో వంతు జరగడం కనాకష్టంగా మారిపోయింది. జిల్లాలో 91 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇందులో  24 గంటలు పనిచేసే 54 పిహెచ్‌సీలు మిగిలినవి పగలు మాత్రమే తెరిచేవి. 24 గంటల పీహెచ్‌సీల్లో ఇద్దరు చొప్పున, పగలు పనిచేసే వాటిలో ఒకరు చొప్పున వైద్యులు పనిచేస్తుంటారు. వైద్యుల కొరత ఉంటే జిల్లా అధికారుల చొరవతో ఒప్పంద పద్ధతిలోనైనా నియమిస్తున్నారు. ఒక్కొక్కరికి నెలకు వేతనంగా రూ. 53,500 చెల్లిస్తున్నారు. దాంతో వైద్యాధికారుల కొరతనేది లేదు. అలాగే స్టాఫ్‌నర్సులు కానీ ఏఎన్‌ఎంల కొరత ఏర్పడితే వెంటనే ఒప్పంద పద్ధతిలోనే నియమిస్తున్నారు. సిబ్బంది కొరత పెద్దగా లేదనే చెప్పాలి. ఇంత జరుగుతున్నా  వైద్యసేవలు గ్రామీణ ప్రాంతప్రజలకు సక్రమంగా అందడం లేదు.
రానురాను జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య తగ్గిపోతోంది. జిల్లాలో రెగ్యులర్‌ వైద్యాధికారుల కొరత ఉంటే ఒప్పంద పద్ధతిలోనైనా నియమిస్తున్నారు. కానీ ఆ స్థాయిలో సేవలైతే అందడం లేదు. ఆర్థిక సంవత్సరం 7 నెలలు గడిచింది. ఈ ఏడు నెలల్లో 10లోపు ప్రసవాలు జరిగిన పీహెచ్‌సీలు ఐదు ఉన్నాయి. తాడువాయిలో 4, గుడివాకలంకలో 6, గోపన్నపాలెంలో 8, పిప్పరలో 3, పెదకాపవరంలో 9 ప్రసవాలు మాత్రమే జరిగాయి.
పిప్పరకు భవనం లేదు. ప్రస్తుతం పాఠశాలలో నిర్వహిస్తున్నారు. మిగిలిన మూడు పీహెచ్‌సీల వైద్యాధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.  24 గంటలు పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు 20, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేసే పీహెచ్‌సీల్లో నెలకు 10 ప్రసవాలు చేయాలనేది లక్ష్యం. జిల్లాలో 91 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వాటిలో ఈ ఏడునెలల్లో 10080 ప్రసవాలు జరగాల్సి ఉండగా అందులో మూడోవంతు 3462 మాత్రమే జరిగాయి. ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాత్రం లక్ష్యాన్ని దాటి ప్రసవాలు చేసింది. పెనుమంట్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏడు నెలలకు 70 ప్రసవాలు నిర్వహించాల్సి ఉండగా 85 చేసి 121శాతంతో అగ్రస్థానంలో ఉంది.
రోజంతా పనిచేసే పీహెచ్‌సీల్లో 50 శాతం లక్ష్యాన్ని చేరినవి 6 మాత్రమే ఉన్నాయి. 25 నుంచి 50 శాతంవి 17 ఉన్నాయి. 25శాతం లోపువి 16 ఉన్నాయి. మన్యం ప్రాంతంలో 50 శాతం పైబడి ఉన్న పీహెచ్‌సీలు రెండు, 50 శాతంలోపు ఉన్నవి 4, 25 శాతం లోపు ఉన్నవి 11 ఉన్నాయి. పగటిపూట పనిచేసే పీహెచ్‌సీల్లో 50 శాతం దాటినవి 15 ఉన్నాయి. 25 నుంచి 50 శాతం ప్రసవాలు జరిగిన పీహెచ్‌సీలు 11, 25 శాతంలోపు చేసినవి 9 ఉన్నాయి.  ఒక ఏడాదిలో జిల్లాలో 45 వేల వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. అందులో పీహెచ్‌సీల లక్ష్యం 17640 ప్రసవాలు. అందులో మూడోవంతు చేరుకోవడం గగనంగా మారిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉండే పీహెచ్‌సీల్లో సక్రమంగా సేవలందితే ప్రైవేటు ఆసుపత్రుల జోలికి వెళ్లే అవకాశమే ఉండదు. కొన్ని పీహెచ్‌సీల్లో పనిచేసే వైద్యాధికారులు కానీ, వైద్యసిబ్బంది అందుబాటులో ఉండరు. ఒక వేళ ఉన్నా ఇక్కడకంటే ప్రైవేటు ఆసుపత్రులకు తరలించేస్తేనే మంచిదని సలహాలు ఇచ్చేవారే ఎక్కువగా ఉంటారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసేవారికి ప్రైవేటు క్లినిక్‌లు ఉండనే ఉంటాయి. కిందస్థాయి సిబ్బంది కూడా తమ వైద్యాధికారులు ఎక్కడ ఉంటారో అక్కడకు తీసుకెళ్లండని ఉచిత సలహాలు ఇస్తుంటారు. దాంతో ప్రసవాలతోపాటు ప్రతిచిన్న చికిత్సకూ ప్రైవేటు బాట పడుతున్నారు.
Tags:What’s up to my mother?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *