అవకతవకలకు తెరపడేదెన్నడు?

Date:09/10/2018
కర్నూలు ముచ్చట్లు:
రాయలసీమ యూనివర్సిటీ పీజీ సెట్ నిర్వహణలో అవకతవకలు సాగుతున్నట్లు కొంతకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్సిటీ అధికారులకు టెక్నికల్  అంశాలపై పెద్దగా అవగాహన లేని విషయాన్ని కాంట్రాక్ట్ కుదుర్చుకున్న సంస్థలు క్యాష్ చేసుకుంటున్నట్లు ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయి. డిగ్రీ పరీక్షలు నుంచి వర్సిటీలోని కళాశాల, అనుబంధ కళాశాలల విద్యార్థులకు సంబంధించిన ఫలితాలు, ప్రవేశాలు, ఫీజులు లాంటివి ఆన్‌లైన్‌లో నమోదుకు గుంటూరుకు చెందిన ప్రైవేటు సొల్యూషన్‌తో నిర్వహిస్తున్నారు.
ఇక్కడే అవకతవకలు సాగుతున్నాయన్న విమర్శలు చక్కర్లు కొడుతున్నాయి. విశ్వవిద్యాలయం పరిధిలో పరీక్షల నిర్వహణ బాధ్యత ప్రైవేటు సొల్యూషన్‌ పర్యవేక్షిస్తోంది. దీనికిగాను వర్సిటీయే ఒక్కో విద్యార్థి పేరుపై కొంత సొమ్ము చెల్లిస్తుంది. ఎగ్జామ్ ఫీజులు మొదలుకుని అప్‌లోడ్‌, హాల్‌టికెట్‌ జారీ, మార్కుల నమోదు, ర్యాంకుల ప్రకటన, ఫలితాలు లాంటి డ్యూటీలను ప్రైవేటు వ్యక్తులు చూస్తుంటారు. గతంలో ప్రైవేటు కాలేజీలతో చేతులు కలిపి ర్యాంకులు సైతం మాయ చేశారన్న ఆరోపణలు వినిపించాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు భారీ కసరత్తే చేశారు.
పరీక్షల నిర్వహణ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే సంస్థకు పని అప్పగించే నిమిత్తం టెండర్లు పిలిచారు. అయితే ఈ ప్రక్రియ కష్టంగా మారింది.
దీంతో అధికారులు టెండర్‌ రద్దు చేశారు. సిబ్బందిలోని ఓ వ్యక్తి మాత్రం చక్రం తిప్పి పీజీ సెట్‌ ఆన్‌లైన్‌ చేస్తున్న సొల్యూషన్‌ నిర్వాహకులను ఉన్నతాధికారులకు పరిచయం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సదరు వ్యక్తి వల్లే టెండర్లలో పాల్గొనని వ్యకికి వర్సిటీ అధికారులు ఒప్పందాలు చేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వర్సిటీ పిలిచిన టెండర్లలో పాల్గొనకుండానే పనులు అప్పగించడంపై పలు ఆరోపణలు ఎదురవుతున్నాయి.
ప్రైవేటు సొల్యూషన్‌ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో పొరపాట్లు ఉన్నాయని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రతినిధులు కొన్నిరోజుల క్రితం ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. కాంట్రాక్ట్ అప్పగింత స్థాయిలోనే ఇన్ని సమస్యలు తలెత్తితే ఫలితాల సమయంలో పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలాఉంటే ప్రవేశపరీక్షల్లో అవకతవకలు సాగుతున్నట్లు వస్తున్న ఆరోపణలపై వర్సిటీ రిజిస్ట్రార్ స్పందించారు. అక్రమాలకు ఎంత మాత్రం సహించమని తేల్చి చెప్పారు. యూనివర్సిటీ ప్రతిష్టకు కాపాడతామని, ఈ అవకతవకలునిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.
Tags:What’s wrong to open up?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *