ఇసుకాసురులకు అడ్డుకట్టపడేదెన్నడు?

What's wrong with sandals?

What's wrong with sandals?

Date:24/04/2018
ఖమ్మం ముచ్చట్లు:
ఖమ్మం జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. అధికార యంత్రాంగం ఉదాసీనత దరిమిలా ఈ దందాకు చెక్ పడడంలేదు. కొందరు వ్యాపారులతో పాటూ నేతలూ ఈ బిజినెస్ లో తలమునకలై రూ.కోట్ల మేర ప్రభుత్వాదాయానికి గండికొడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారం, అర్ధ బలంతో రెచ్చిపోతున్న అక్రమార్కులకు అధికారులు సైతం ముకుతాడు వేయలేని పరిస్థితి ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు అక్రమార్కులకు కొందరు సిబ్బంది సహకరిస్తుండడంతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టపడడంలేదని జిల్లావాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగిపోతుండడంతో స్థానికంగా నీటి వనరులు ప్రభావితమవుతున్నాయని, తాగు-సాగు నీటికి ఇబ్బందులు ఏర్పడమే ప్రమాదం ఉందని అంటున్నారు. ఖమ్మంలోనే కాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఈ దందా యథేచ్ఛగా సాగిపోతున్నట్లు ప్రజలు అంటున్నారు. అధికారుల ఉదాసీనతతో అక్రమార్కులు మరింతగా రెచ్చిపోతున్నారని చెప్తున్నారు. ఉభయ జిల్లాల్లో ఇసుక అక్రమ దందా పరిశీలిస్తే విస్తుపోవడంఖాయం. స్థానికంగా ఇసుక దందా జోరుగా సాగుతోంది. టన్ను ఇసుక కోసం ఖమ్మం నగరంలో రూ.1,050 చెల్లించాల్సి వస్తోంది. ఈ లెక్కన దోపిడీ పెద్ద మొత్తంలోనే ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. సాధారణ ఇసుక, స్థానిక అవసరాలకు ఇచ్చే ఇసుక అనుమతులు ఇచ్చేసిన తర్వాత అధికారులు పట్టించుకోవడంలేదన్న విమర్శ ఉంది. భూగర్భ గనులశాఖ అధికారులు అనుమతులు ఇచ్చిన తర్వాత శాఖపరంగా ఎన్ని క్యూబిక్‌ మీటర్ల ఇసుక తరలించేందుకు ఇచ్చిన అనుమతులను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. అంతేకాక ఎంత మేర ఇసుక తీశారు అనే విషయాన్ని పర్యవేక్షించాలి. కానీ ఈ అంశాలపై సంబంధిత అధికారులు పెద్దగా దృష్టి పెట్టిందిలేదు. దీంతో అక్రమార్కులు ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠినచర్యలకూ అధికారులు వెనకాడుతున్నట్లు ఆరోపిస్తున్నారు. వేసవి కావడంతో నీరు అంతగా ఉండదు. దీంతో స్థానికంగా ఇసుక అక్రమ తవ్వకాలు సాగిపోతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి ఈ దందాకు సత్వరమే చెక్ పెట్టాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *