Natyam ad

మదనపల్లె ముస్లింలు ఎటు?

-తొలిసారిగా రెండు ప్రధాన పార్టీ అభ్యర్థులు ముస్లింలే
-నిసార్ రాజకీయాలకు కొత్త
-ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఓడిన నేతగా షాజహాన్
-బలాబలాలపై చర్చోప చర్చలు

 

మదనపల్లె ముచ్చట్లు:

Post Midle

మదనపల్లె శాసనసభకు 1952 నుంచి మొదలైన సార్వత్రిక ఎన్నికల చరిత్ర ఒకవైపు.. వచ్చే ఏప్రిల్ లో జరగనున్న ఎన్నిక ఓవైపుగా చరిత్ర సృష్టించనుంది. దీనికి ప్రధాన కారణం రెండు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులుగా‌ ముస్లింలను ఎన్నికల బరిలోకి దింపాయి. ఇది మదనపల్లెకే కాదు రాయలసీమ మొత్తానికి ఉత్కంఠ ఎన్నిక. ఇద్దరు అభ్యర్థుల బలాబలాలు చూస్తే టిడిపి అభ్యర్థి షాజహాన్ బాషా రాజకీయ జీవితం గడుపుతున్నారు. వైయస్సార్ సిపి అభ్యర్థి నిసార్ అహ్మద్ రాజకీయాలకు కొత్త. ప్రభుత్వ ఇంజనీర్గా పనిచేసిన ఆయనకు పరిచయాలు ఉన్నప్పటికీ ప్రస్తుత రాజకీయాల్లో నెగ్గుకు రావడం ఆషామాషీ కాదు.

 

 

ఎమ్మెల్యేగా ఏకఛత్రాధిపత్యం….

మదనపల్లెకు శాసనసభ్యులుగా పనిచేసిన వారిలో 2009 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రస్తుత టిడిపి అభ్యర్థి షాజహాన్ బాషా ఏకఛత్రాధిపత్యంగా మదనపల్లెను ఏలారు. ఆయన మాటే శాసనంగా అమలైంది. అభివృద్ధి విషయంలో ముందున్నారు‌. ప్రధానంగా వక్ఫ్ ఆస్తుల రక్షణకు తీసుకున్న చర్యలు గతంలో ఎవరు తీసుకోలేదు. కొత్త ఆదాయ వనరుల సృష్టి, భూముల పరిరక్షణకు చర్యలు ముస్లింల్లో ఇప్పటికీ ఆయనపై అనుకూల భావన ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. 2014లో ఎమ్మెల్యేగా, 2019లో రాజంపేట ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా మళ్లీ పోటీ చేస్తున్నారు.

 

ఇంజనీర్గా సుపరిచితుడు…..

వైఎస్ఆర్సిపి అభ్యర్థి నిసార్ అహ్మద్ ఇంజనీర్గా అందరికీ సుపరిచితుడు. తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల్లో పిఆర్ ఇంజనీర్గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 1999లో పోటీ చేస్తారని ఆయన పేరు తెరపైకి వచ్చింది. అప్పుడు ఏం జరిగింది ఏమో మున్సిపల్ చైర్మన్ ముజీబ్ హుస్సేన్ పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కూడా తరచూ నిసార్ అహ్మద్ అభ్యర్థిత్వంపై ప్రచారం జరిగేది. చివరకు ఇప్పుడు పోటీ చేసే అవకాశం దక్కింది. ఇంజనీర్ గా పని చేసిన అనుభవం తప్పితే రాజకీయాల్లో ఆయనకు తెలిసిందేమీ లేదు. ఎన్నికల్లో ఆయనకు పార్టీయే కొండంత అండ. ప్రజాసేవలో ఎన్నడులేని ఆయన ఈ ఎన్నికలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

సెంటిమెంట్ అధిగమిస్తారా………

మదనపల్లె రాజకీయాల్లో ఓ సెంటిమెంట్ ఉంది. 1952, 1957లో దొడ్డ సీతారామయ్య రెండుసార్లు, 1983, 1985లో రాటకొండ నారాయణరెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. వీరు కాకుండా 1989 తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి రెండోసారి పోటీ చేసిన ఆవుల మోహన్ రెడ్డి (కాంగ్రెస్), దొమ్మలపాటి రమేష్, రాటకొండ సాగర్ రెడ్డి ( టిడిపి), ఓటమి పాలయ్యారు. 1989 నుంచి ఒక్కరు కూడా రెండోసారి ఎమ్మెల్యే కాలేదు. షాజహాన్ బాషా ఒకసారి కాంగ్రెస్ టికెట్ పై గెలిచి మరోసారి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి ఓడారు. ఇప్పుడు కాంగ్రెస్పై కాకుండా టిడిపి అభ్యర్థిగా షాజహాన్ పోటీ చేస్తున్నారు. ఆయన అదృష్టం ఎలా ఉందో చూడాలి.

 

ముస్లింలు ఎటు…

మదనపల్లిలో మెజార్టీ ఓట్లు కలిగిన ముస్లింలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ పరంగా అభ్యర్థులను ఆదరిస్తారా లేక తమకు అనుకూలమైన అభ్యర్థికి అండగా నిలుస్తారా. వ్యూహ ప్రతి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి అనేది చూడాలి.

Tags: Where are the Muslims in Madanapalle?

Post Midle