ఎక్కడి సమస్యలు అక్కడే..

Date:17/09/2018
ఆదిలాబాద్‌ ముచ్చట్లు:
తెలంగాణ సర్కార్ గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. కొత్త పంచాయతీయలకూ అధికారులను కేటాయించారు. ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో అభివృద్ధి ఆగకుండా నిరాటకంగా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఆగస్టు 1న అధికారులు బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా వివిధ కారణాలతో గ్రామాల్లో సమస్యల పరిష్కారం.. అభివృద్ధి పనులు పడకేసినట్లు ఆదిలాబాద్ జిల్లాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రత్యేక అధికారులు గ్రామ పంచాయతీల్లో గడుపుతున్నది తక్కువ సమయమే అని పలువురు అంటున్నారు. గతంలో వారు చేస్తున్న పనులతోనే క్షణం తీరిక లేకుండా పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నూతన పంచాయతీల్లో అభివృద్ధి కలగానే మారుతోందని పలు గ్రామాల నుంచి వస్తున్న అసంతృప్త కామెంట్స్ ఇవి. గ్రామాల్లో చాలా కాలంగా పలు సమస్యలు తిష్టవేశాయి.
డ్రైనేజ్, పారిశుద్ధ్య విభాగాల్లో ఇబ్బందులున్నాయి. ప్రస్తుతం ఈ విభాగాల్లో పనులు సజావుగా సాగకపోవడంతో ప్రజలు సమస్యలతో సావాసం చేయాల్సిన పరిస్థితి. ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని దుస్థితిలో ఉన్నామని పలువురు వాపోతున్నారు.
ఉన్న సమస్యలు చాలవన్నట్లు కొత్త సమస్యలు ఏర్పడుతున్నాయని మొత్తంగా పలు ఇబ్బందులు పేరుకుపోతున్నాయని అంటున్నారు. ప్రధానంగా వర్షాలొస్తే గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారుతోందని చెప్తున్నారు. మారుమూల గిరిజన గ్రామాల్లో అయితే పరిస్థితులు దుర్భరంగా ఉంటున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.
గ్రామాల్లో తిష్టవేసిన పారిశుద్ధ్య లోపం వల్ల ప్రజలు రోగాల బారినపడుతున్నారని తాగునీరు కూడా కలుషితమవుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రధాన గ్రామ పంచాయతీల్లో రహదారుల వెంట బ్లీచింగ్‌ చల్లడం వంటి అరకొర పారిశుద్ధ్య కార్యక్రమాలు మినహా అధికారులు పటిష్ట చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని వ్యాఖ్యానిస్తున్నారు.
మారుమూల గ్రామ పంచాయతీలు, కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు పడకేశాయని అంటున్నవారూ ఉన్నారు. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లోనూ ఇదే దుస్థితి నెలకొన్నట్లు పలువురు విమర్శిస్తున్నారు. జిల్లాలో 467 గ్రామ పంచాయతీలున్నాయి. ప్రత్యేక అధికారులు గ్రామ పంచాయతీల సందర్శన.. తీసుకుంటున్న చర్యలు, ప్రజల సమస్యల ఆరా వంటివి చేస్తున్న దాఖలాలు లేవని ప్రజలు విమర్శిస్తున్నారు.
పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా కేటాయించినా వారు తమ విభాగం పనులతోనే బిజీగా ఉంటున్నారు. దీంతో గ్రామాల సమస్యలపై దృష్టిపెట్టలేకపోతున్నారు. అదనంగా పంచాయతీల బాధ్యతలు వారికి తలకు మించిన భారంగానే ఉంటోంది. అదనపు బాధ్యతల వల్లే గ్రామాల్లో పలు సమస్యలకు తెరపడడంలేదు.
అయితే.. ఇలాంటి కారణాలతో.. గ్రామాలను నిర్లక్ష్యం చేయడం తగదని.. ఊళ్లలో తిష్ట వేసిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందే అని ప్రజలు అంటున్నారు. లేకుంటే ప్రజలు రోగాల బారిన పడడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.
Tags:Where are the problems

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *