శుభ్రత ఎక్కడ..? (ఖమ్మం)

Date:15/09/2018
ఖమ్మం ముచ్చట్లు
జిల్లాలోని పల్లెల్లో పరిశుభ్రత భూతద్దం వేసి వెతికినా కనిపించడం లేదు. పారిశుద్ధ్య సమస్యతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. వ్యర్థాలు, చెత్త పారబోసేందుకు స్థలం లేక రహదారులు, ఇళ్ల వెంబడి పేరుకుపోతోంది. స్వచ్ఛభారత్‌లో భాగంగా ప్రతి గ్రామానికి డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో నిధులు కేటాయించింది.
అధికారుల నిర్లక్ష్యం, స్థలాల కొరత ఇతర అడ్డంకులు ఆశయానికి అవరోధాలుగా మారుతున్నాయి. జిల్లాలో 343 డంపింగ్‌ యార్డులు మంజూరైతే కేవలం 19 మాత్రమే పూర్తవడం దీనికి నిదర్శనం. ఇటీవల తరుణ వ్యాధులు చుట్టుముట్టాయి. ఇవి డంపింగ్‌ యార్డుల ఆవశ్యకతను నొక్కిచెపుతున్నాయి.
ప్రజారోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించే పారిశుద్ధ్యం సమస్య పరిష్కారంగా గ్రామస్థాయిలో డంపింగు యార్డుల నిర్మాణాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం తలపెట్టింది. గ్రామాల్లో సేకరించిన చెత్తా చెదారాన్ని వేసేందుకు శివార్లలో వీటి నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వీటి నిర్మాణాలను ప్రోత్సహించాలని తలపెట్టారు.
పంచాయతీరాజ్‌ శాఖ పర్యవేక్షణలో వీటిని నిర్మించాల్సి ఉంది. స్థలాల సమస్య పరిష్కారంలో రెవెన్యూ, స్థలాలు ఉన్నా నిర్మాణాలకు చొరవ తీసుకోవాల్సిన పంచాయతీరాజ్‌ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో పనులు ముందుకు సాగడంలేదు.స్వచ్ఛ భారత్‌లో భాగంగా గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు, అపరిశుభ్రతతో ప్రజలు అనారోగ్యం పాలవకుండా డంపింగు యార్డులను నిర్మించాలని ప్రతిపాదించారు.
నివాసాలకు దూరంగా ప్రభుత్వ, శివార్లలోని నిరుపయోగ స్థలాలను ఇందుకోసం వినియోగించాలి. ఆమోదించిన నమూనాలో, నిర్దేశిత ప్రమాణాలతో వీటి నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. తాగు, సాగునీటి పథకాలు, బోర్లు, బావులకు దగ్గరలో, లోతట్టు ప్రదేశాల్లో, వాగులు, చెరువు శిఖంలో వీటిని నిర్మించకూడదు. వర్షపునీరు లోపలకు ప్రవేశించకుండా ఎత్తయిన ప్రదేశాన్ని ఇందుకు ఎంపిక చేయాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వం ఒక్కొక్క దాని నిర్మాణానికి సుమారు రూ.1.50లక్షలు కేటాయిస్తోంది.
ఖమ్మం జిల్లాలోని మొత్తం 20 మండలాల్లో 585 పంచాయతీలు ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ పథకంలో భాగంగా జిల్లాలో 343 డంపింగు యార్డుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. అయినా నేటికి కేవలం 19 మాత్రమే పూర్తి చేయగా, మరో 136 నిర్మాణ దశలో ఉన్నాయి. ఇప్పటి వరకు వీటి నిర్మాణాలకు రూ.1.42కోట్లు చెల్లించారు.
జిల్లా కేంద్రానికి అత్యంత చేరువగా ఉన్న రఘునాథపాలెం మండలంలో అధికారిక లెక్కల ప్రకారం 9 డంపింగు యార్డులు మంజూరయ్యాయి. వీటిలో వేపకుంట్ల, వి.వెంకటాయపాలెం పూర్తయ్యాయి. చింతగుర్తి, మంచుకొండ, బూడిదంపాడు గ్రామాల్లో పనులు ప్రగతిలో ఉన్నాయి. వీటిని పరిశీలించగా పూర్తయిన వి.వెంకటాయపాలెం డంపింగు యార్డు పిచ్చిచెట్లతో నిండిపోయింది.
గ్రామం నుంచి చెత్త రిక్షాలు వెళ్లివచ్చే మార్గం రాకపోకలకు అనుకూలంగా లేదు. మంచుకొండ గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా చెరువు శిఖంలో నిర్మించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇది పూర్తిగా నీట మునిగి పోయింది. అత్యంత చేరువలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. బూడిదంపాడు గ్రామంలో శ్మశానవాటిక స్థలంలో నిర్మాణ పనులు చేపట్టారు.
ఎముకలు, పుర్రెలు వస్తుండటంతో ఉపాధి కూలీలు తవ్వకాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపడంలేదు. దీంతో పనులు ముందుకు సాగడంలేదు.పథకం నీరుగారిపోవడానికి వివిధ శాఖల అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. ఉపాధి, పంచాయతీరాజ్‌, రెవెన్యూ శాఖలు డంపింగు యార్డుల నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.
రెవెన్యూ శాఖ స్థలాలు కేటాయిస్తుంటే, పంచాయతీరాజ్‌ శాఖ సిబ్బంది పనుల మంజూరును, నిర్మాణ పనులను ఉపాధి సిబ్బంది పర్యవేక్షించాల్సి ఉంది. కానీ ఎన్నో గ్రామాల్లో నేటికీ స్థలాల సమస్యను రెవెన్యూ సిబ్బంది పరిష్కరించలేదు. కేటాయించిన స్థలాల్లో కొన్ని గ్రామాలకు బాగా దూరంగా ఉండగా, మరికొన్ని నిబంధనలకు విరుద్ధంగా చెరువు శిఖం భూములు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయి. పనులు ప్రారంభించిన వాటిని పూర్తి చేయడంలో ఉపాధి సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు.
Tags:Where is Cleanliness? (Khammam)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *