మద్దతు ఎక్కడ..?

Date:19/11/2018
తిరువూరు ముచ్చట్లు:
పంటకు మద్దతు ధర అందించాల్సిన అధికారులు ప్రకటనలకే పరిమితమయ్యారు. అధికారిక కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకే పంటను చేజిక్కించుకుంటున్నారు. తెల్లబంగారం మార్కెట్‌లో తేలిపోయింది.. అన్నదాతకు నిరాశే మిగిలిస్తోంది. ఈ ఏడాది పశ్చిమకృష్ణాలోని 51 వేల హెక్టార్లలో పత్తి సాగు చేశారు. సాగు ప్రారంభం నుంచి ప్రతికూల వాతావరణమే. ఆదిలో అధిక వర్షాలతో చెట్లు నీట మునిగి తెగుళ్లు వ్యాపించాయి. ఆపై వర్షాభావంతో  ఎండిపోయాయి. సాగర్‌ జలాలు విడుదలైనా చివరి భూములకు అందక పలు గ్రామాల్లో పంట దెబ్బతింది. రైతుకు పెట్టుబడి వ్యయం కూడా దక్కనంతగా పంట దిగుబడి ఉంది. నవంబరు వచ్చేసరికే అన్నదాతల ఇళ్ల ముంగిట తెల్లబంగారం మెరుస్తూ ఉండాలి. ఇప్పటికి ఒక్కరు కూడా సంతోషంగా లేరు. ఈ ఏడాది ఆగస్టులో  కురిసిన భారీ వర్షాలు, ఆపై సెప్టెంబరు నుంచి నెలకొన్న వర్షాభావంతో 80 శాతం మేరకు పంట దెబ్బతింది.
జిల్లాలో పత్తి దిగుబడి ఎకరాకు సగటున 8 క్వింటాళ్లు ఉండగా ఇప్పుడు సగటు దిగుబడి 4 క్వింటాళ్ల వరకు ఉంటుంది. ఎకరాకు పెట్టుబడి కూడా రూ.40 వేలు వరకు ఉంటుంది. ప్రస్తుతం ఎకరాకు 2.5 నుంచి 3.5 క్వింటాళ్ల దిగుబడి కూడా లేదని రైతులు తెలిపారు. పత్తి ధరలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. అటు దిగుబడి, ఇటు ధర లేక కర్షకులు డీలాపడ్డారు. ప్రైవేటు మార్కెట్‌లో అక్టోబరులో క్వింటాల్‌ ధర రూ.5,600 వరకు ఉంది. ప్రస్తుతం రూ.5,100కు దిగజారింది. భారతీయ పత్తి సంస్థ మద్దతు ధర రూ.5,450 ప్రకటించింది. ఇప్పటి వరకు జిల్లాలో కొనుగోలు కేంద్రం తెరవలేదు. సీసీఐ కేంద్రాలు లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారుల చెప్పిందే ధర అయింది.
జిల్లాలోని మైలవరం, గంపలగూడెం, తిరువూరు, జగ్గయ్యపేట, ఎ.కొండూరు, నందిగామ, కంచికచర్ల యార్డుల్లో సీసీఐ కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంది. ఏటా అక్టోబరు నాటికే ఈ కేంద్రాలు తెరిచేవారు. ఈ ఏడాది నవంబరు రెండో వారం పూర్తికావస్తున్నా వీటి జాడలేదు. పింజ పొడవు సరిగ్గా లేదని ప్రైవేటు వ్యాపారులు ధరను తగ్గించేస్తున్నారు. జిల్లాలోని గంపలగూడెం, జగ్గయ్యపేట, ఇబ్రహీంపట్నంను కరవు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మూడు మండలాల్లో వ్యవసాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో పత్తి నష్టంపై సర్వే ప్రారంభించారు. ఈక్రాప్‌ ఆధారంగా నష్టంపై సర్వే చేస్తున్నారు. సాగు చేసిన గ్రామాల్లో పర్యటించి పంటను పరిశీలించి సంబంధిత భూముల ధ్రువీకరణ పత్రాల సహా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. వ్యవసాయాధికారులు మరో వారం రోజులపాటు నష్టంపై నివేదికలు సిద్ధం చేస్తారు.
Tags:Where to Support?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *