మునుగోడు ఎవరికి పట్టేను..

నల్గొండ  ముచ్చట్లు:

ఆయన మాజీ ఎమ్మెల్యే. అధికారపార్టీ నేత. గత ఎన్నికల్లో ఓడినా నియోజవర్గానికి ఆయన్ని పార్టీ ఇంఛార్జ్‌ను చేశారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి పాగా వేయాలని పార్టీ చూస్తుంటే.. అయ్యవారి వేషాలు మరోలా ఉన్నాయట. సమస్య ముదురు పాకాన పడి.. డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోందట. దీంతో ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టిందట అధిష్ఠానం. అదెక్కడో.. ఏం జరుగుతుందో లెట్స్‌ వాచ్‌..!ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలలో 11 చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండగా.. ఒక్క మునుగోడులో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మునుగోడును కూడా తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది టీఆర్ఎస్‌. ఈ విషయంలో అధికారపార్టీ పెద్దలు ఒకటి తలిస్తే.. స్థానికంగా జరుగుతున్న పరిణామాలు అస్సలు మింగుడు పడటం లేదట. మునుగోడు టీఆర్ఎస్‌ ఇంఛార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత వైఫల్యాలను అధిగమించి.. పార్టీ బలోపేతానికి కూసుకుంట్ల కృషి చేస్తారని పార్టీ భావిస్తే.. అక్కడ మూడు గ్రూపులు.. ఆరు పంచాయితీలు అన్నట్టు మారిపోయిందని పార్టీ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయట.మునుగోడులో ప్రత్యర్థి పార్టీలతో పోరాటం కంటే.. టీఆర్‌ఎస్‌లోని నేతల మధ్యే గొడవలు ఎక్కువ. ఇందులోనూ కూసుకుంట్ల ప్రత్యేకత ఉందట. ఆయనే గ్రూపులను ప్రోత్సహిస్తూ.. వారి మధ్య ఘర్షణ వాతావరణం తీసుకొస్తున్నారని గులాబీ శ్రేణులు ఆరోపణ. సొంత పార్టీ నేతలపైనే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

 

 

 

ఒకప్పుడు మునుగోడులో ఉద్యమకారులు.. సీనియర్‌ నాయకులు టీఆర్‌ఎస్‌కు అండగా ఉండేవారు. పరిస్థితుల్లో వచ్చిన మార్పులతో వాళ్లంతా పార్టీకి దూరమయ్యారట. 2018 ఓటమికి దారితీసిన పరిస్థితులు.. సమస్యలు ముదురు పాకాన పడినట్టు టాక్‌. స్థానికంగా టీఆర్‌ఎస్‌లో ఎవరు అసంతృప్తితో ఉన్నారో.. ఎవరు పార్టీకి దూరంగా ఉన్నారో తెలిసినా వారితో కూసుకుంట్ల చర్చలు జరపకపోవడం సమస్యను మరింత దిగజారుస్తున్నట్టు చెబుతున్నారు.మునుగోడులో పార్టీని గాడిలో పెట్టేందుకు టీఆర్‌ఎస్‌ ప్రత్యేక దృష్టి పెట్టింది. మంత్రి జగదీశ్వర్‌రెడ్డి నియోజకవర్గంలో పలుమార్లు పర్యటించి.. అసంతృప్తులతో మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు స్వింగ్‌లో ఉన్నా.. క్షేత్రస్థాయిలో నెలకొన్న ప్రతికూల వాతావరణాన్ని సెట్‌ చేసేందుకు ఆయన ప్రయత్నించారట. అయితే కూసుకుంట్ల వైఖరి వల్ల సమస్య మళ్లీ మొదటి రావడంతో మంత్రి ఇతర పార్టీ నేతలు కంగుతిన్నట్టు సమాచారం. దాంతో మునుగోడు నియోజకవర్గంలోని గ్రామస్థాయి ప్రజాప్రతనిధులతో మంత్రి సమావేశం నిర్వహించారట. ప్రజాప్రతినిధులంతా కూసుకుంట్ల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని.. ఏకరవు పెట్టారట. ఆ సమయంలో కూసుకుంట్ల అక్కడే ఉన్నప్పటికీ సమస్య చెప్పడానికి వెనకాడ లేదట పార్టీ నేతలు.వాస్తవ పరిస్థితులను పార్టీ పెద్దలకు నివేదించాలని.. సమస్యపై సీరియస్‌గానే ఫోకస్‌ పెట్టాలనే అభిప్రాయానికి వచ్చారట మంత్రి. మొత్తంగా మునుగోడులో పార్టీ పరిస్థితి కడుపు చించుకుంటే కాళ్లమీద పడినట్టుగా తయారైందని చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఎన్నికల మూడ్‌లోకి వెళ్తున్న సమయంలో మునుగోడులో టీఆర్ఎస్‌ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.

 

Tags: Who cares first..

Leave A Reply

Your email address will not be published.