రైతు బంధు ఎవరికి..?

Date:06/12/2018
కడప ముచ్చట్లు:
కష్టాల సేద్యం నుంచి కర్షకులను గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఆపదలో ఉన్న అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పించాలని పాలకులు ముందుకొచ్చారు. రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయిలో అమలు తీరుపై పర్యవేక్షణ కొరవడింది. పుడమి పుత్రులకు పుట్టెడు దుఃఖం మాత్రమే మిగిలింది. మార్కెట్‌ యార్డుల్లో రూ.లక్షలు ధారపోసి నిర్మించిన గోదాములను ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు అద్దెకిచ్చారు. ఆరుగాలం శ్రమించి పండించిన వ్యవసాయ ఉత్పత్తులను తనఖా పెట్టి రుణం పొందాలంటే రైతులు రణం చేయాల్సి వస్తోంది. మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి సొంత జిల్లాలోనే నిర్దేశిత లక్ష్యం నెరవేరడం లేదు. సగానికి పైగా కమిటీల్లో దీని ఊసే లేకున్నా ప్రశ్నించే దిక్కులేదు. జిల్లాలో 12  వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి.
వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులు, ఇతర సరకులు నిల్వ చేసుకునేందుకు 48 గోదాములు నిర్మించారు. వీటి నిల్వ సామర్థ్యం 48 వేల మెట్రిక్‌ టన్నులు. కొన్ని కమిటీల్లో ఉన్న గోదాములను నిర్వహించే సామర్థ్యం లేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు అద్దెకిచ్చారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రైతుబంధు పథకంలో రూ.4.40 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ ఏడాది ఏప్రిల్‌- అక్టోబరు వరకు ఏడు నెలల్లో 59 మందికి రూ.73.76 లక్షలు రుణాలు ఇచ్చారు. అంటే 16.76 శాతం ప్రగతి సాధించారు.  గత ఖరీఫ్‌ సీజన్‌లో వరిపంట సాధారణ విస్తీర్ణం 37,521 హెక్టార్లు కాగా 39,041 హెక్టార్లలో సాగైంది. హెక్టారుకు సగటు దిగుబడి 45- 48 క్వింటాళ్లు వస్తుందని అంచనా.
జిల్లా కేంద్రంలో ఉన్న కడప వ్యవసాయ మార్కెట్‌ కమిటీ 14.34 ఎకరాల్లో విస్తరించింది. ఏడు గోదాములు ఉంటే 7,150 టన్నులను నిల్వ చేసుకోవచ్చు. ఈసారి రైతుబంధు పథకంలో రూ.50 లక్షలు ఇవ్వాలని ఉన్నతాధికారులు అనుమతిచ్చారు. ఇప్పటికే ఏడు నెలల కాలం కరిగిపోయింది. ఇక్కడ ఒక్కరికి ఇచ్చి ఉంటే ఒట్టు. 2015-16, 2016- 17, 2017- 18 సంవత్సరాల్లోనూ ఎవరికీ పైసా ఇవ్వలేదు. జిల్లా కేంద్రంలో సహాయ, ఉప, సంయుక్త సంచాలకులు ఉన్నచోటే అమలుతీరు ఇంత అధ్వానంగా ఉంటే మిగతా కమిటీల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బద్వేలులో 10.10 ఎకరాలను గతంలో కేటాయించారు. నాలుగు గోదాములు ఉంటే 3,500 టన్నులను నిల్వ చేసుకునే వీలుంది. అందులో పౌరసరఫరాల శాఖకు 600 టన్నులు, మార్క్‌ఫెడ్‌ సంస్థకు 900 టన్నులను నిల్వ చేసే గోదాములను అద్దెకిచ్చేశారు. ఈదఫా రూ.50 లక్షల మందికి రుణం మంజూరు చేయాలని అనుమతిచ్చారు. ఇప్పటివరకు ఐదుగురికి రూ.7.16 లక్షలు ఇచ్చారంతే. ప్రగతి 14.32 శాతం సాధించారు.
మైదుకూరులో మూడు గోదాములు ఉండగా 1,800 టన్నులు నిల్వ చేసుకోవచ్చు. 2018-19గాను రైతులకు రూ.20 లక్షలు రుణం ఇచ్చేందుకు ఉన్నతాధికారులు ఆమోదముద్ర వేశారు. గడిచిన ఏడు నెలల్లో పైసా ఇవ్వలేదు. గత మూడేళ్లుగా చూస్తే ఎవరికీ పైసా ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు. పులివెందుల కమిటీలో 17.81 ఎకరాలు ఉంటే నాలుగు వేల టన్నులు నిల్వ చేసుకునేలా ఐదు గోదాములు నిర్మించారు. ఈ ఏడాదిలో రూ.20 లక్షలు ఇచ్చేందుకు పచ్చజెండా ఊపారు. ఇక్కడ కూడా ఎందుకనో ఎవరికీ రూపాయి ఇవ్వలేదు. వాణిజ్య కేంద్రమైన ప్రొద్దుటూరు నడిబొడ్డున మార్కెట్‌ కమిటీకి 7.95 ఎకరాలను కేటాయించారు. ఇక్కడ 13 గోదాములు ఉండగా 7,640 టన్నులు భద్రపరుచుకునే వెసులుబాటు ఉంది. ఈ సంవత్సరంలో రూ.3 కోట్ల రుణం ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. 54 మందికి రూ.66.59 లక్షలు ఇచ్చారు. మిగతా కమిటీలతో పొల్చితే ప్రొద్దుటూరులో అమలు తీరు కొంత నయం. కాకపోతే ఇక్కడ పెద్దలు సిఫార్సు చేసిన వారికే పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
Tags:Who is the farmer’s relative?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *