ఈ సారి ప్రధాని ఎవరు…

న్యూఢిల్లీ  ముచ్చట్లు:


నిన్నమొన్నటిదాకా, ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరు? ఉప రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరు? అనే విషయంలో చర్చోపచర్చలు జరిగాయి. చివరాఖరుకు,కాంగ్రెస్, తెరాస సహా ఓ 18 జాతీయ, ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలు కలిసి మాజీ బీజేపీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి  యశ్వంత్ సిన్హాను ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధిగా బరిలో దింపాయి. ఏమి జరిగింది అన్నది అందరికీ తెలిసిన విషయమే. అధికార బీజేపీ/ఎన్డీఎ అభ్యర్ధి ద్రౌపతి ముర్ము గెలిచారు., బాధ్యతలు స్వీకరించారు.  సిన్హా ఓటమి ఉహించిందే, అయినా, ఉహించిన దానికంటే ఘోరంగా ఓడి పోయారు.  ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయం అయితే చెప్పనే అక్కరలేదు. అధికార బీజేపీ పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంఖర్ ను బరిలో దింపింది, ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ సీనియర్ నేత, మార్గరెట్ ఆల్వాను తమ ఉమ్మడి అభ్యర్ధిగా ప్రకటించాయి.. ఫలితం గురించి పెద్దగా చెప్పుకో వలసింది లేదు. ఆగష్టు 6 పోలింగ్ అదే రోజున కౌంటింగ్ జరుగుతాయి. జగదీప్ ధంఖర్ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే ఇప్పడు విషయం అది కాదు, ఎప్పుడో రెండేళ్ళ తర్వత జరిగే లోక్ సభ ఎన్నికల్లో  బీజేపీ/ఎన్డీఎ ప్రధాని అభ్యర్ధి, మళ్ళీ మోడీనే  అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.  బీహార్ రాజధాని పాట్నాలో జరుగతున్న బీజేపీ అనుబంధ సంఘాు,మోర్చాల జాతీయ సమావేశంలో మాట్లాడుతూ అమిత్ షా  2024లో బీజేపీ-జేడీయూ ఇతర మిత్ర పక్షాలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పారు. అంతే అయితే అదో రకం, కానీ, అమిత్ షా అక్కడితో ఆగలేదు, అందుకు కొనసాగింపుగా, బీజేపీ ప్రధాని అభ్యర్థి మాత్రం నరేంద్ర మోడీనే అని ప్రకటించారు. 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోనే అధికారంలోకి వస్తామని, మళ్లీ మోడీ దేశానికి ప్రధాని అవుతారని పేర్కొన్నారు.  నిజానికి గతంలో స్వయంగా ప్రధాని మోడీనే  ‘మళ్ళీ నేనే’ అని ప్రకటించారు.

 

 

 

అయినా,అమిత్ షా చేసిన ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎప్పుడో రెండేళ్ళ తర్వాత జరిగే ఎన్నికలలో ఎన్డీఎ ప్రధాని అభ్యర్ధి  ఎవరో ఇప్పుడే ప్రకటించవలసిన అవసరం ఏ మొచ్చింది? అనే ప్రశ్న చుట్టూ రాజకీయ చర్చ సాగుతోంది. అయితే, ముందు మోడీ, ఇప్పుడు అమిత్ షా  అదే మాట చెప్పడం వెనక, కమల దళం పక్కా వ్యూహం ఉందని, రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇందులో ప్రధానమైంది, బీజేపీ ప్రధాని అభ్యర్ధి విషయంలో ఎవరు అన్న ఊహాగానాలకు చెక్ పెట్టడమే అయినా. అంతకంటే ముఖ్యంగా, ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు సాగుతున్న ప్రయత్నాలను మొగ్గలోనే తుంచేసేందుకే, అమిత్ షా, ‘కౌన్ బనేగా పీఎం?’ చర్చను తెర మీదకు తెచ్చారని అంటున్నారు.ముఖ్యంగా, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా,విపక్షాల ఐక్యత కంటే,అనైక్యత బాగా బయట పడింది. ఈ నేపథ్యంలో, ప్రధాని పదవిని ఆశిస్తున్న నాయకులు, పార్టీల మధ్య దూరం పెంచి, చిచ్చుపెట్టే ఉద్దేశంతోనే అమిత్ షా ‘కౌన్ బనేగా పీఎం?’ చర్చను తెరమీదకు తెచ్చారని అంటున్నారు. అదే సమయంలో బీజేపీలో 75 సంవత్సరాల వయసు నిండిన వారిని పదవులకు దూరంగా ఉంచాలనే నిబంధన వుంది. మోడీ వయసు, 2024 నాటికి 73 సంవత్సరాలు దాటుతుంది.  (పుట్టిన తేదీ 1950 సెప్టెంబర్ 17) .. సో.. 75 నిబంధన ప్రకారం ఆయన రిటైర్మెంట్ తీసుకుంటారనే ప్రచారం జరుగుతున్న, దృష్ట్యా అమిత్ షా, అలాంటి ఉహగానాలకు చుక్క పెట్టారు.అయితే, అమిత్ షా చెప్పారు కాబట్టి, మోడీనే మళ్ళీ ప్రధాని అభ్యర్ధి అనుకునేందుకు లేదు. ఆ విషయం అమిత షాకు కూడా తెలుసు.. అయినా వ్యూహంలో భాగంగానే ఆయన చర్చకు తెరతీశారని పరిశీలకులు భావిస్తున్నారు. అదే సమయంలో మోడీ విషయంలో 75 నిబంధనను సడలించే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది.

 

Tags: Who is the Prime Minister this time?

Leave A Reply

Your email address will not be published.