ఆ ఒక్క ఛాన్స్ ఎవరికి..?

Date:20/07/2018
అనంతపురం ముచ్చట్లు:
2019 ఎన్నికలు సమీపించబోతున్నాయి. అధికార పార్టీలో ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్నవారు తమతమ సీట్లు పదిలం చేసుకోవడానికి అవసరమైన ఎత్తుగడలు వేస్తున్నారు. ప్రతిపక్ష వైసీపీలో కూడా కొందరు వర్ధమాన నాయకులతోపాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా 2019లో టిక్కెట్లు సంపాదించి పోటీచేసే ప్రయత్నాల్లో మునిగిపోయారు. పాతకాపుల్లో కొందరు తమ ఉనికి చాటుకోవడానికి వీలుగా వచ్చే ఎన్నికల్లో అవకాశం కోసం ఉబలాటపడుతున్నారు.వారిలో ఇంకొందరు 2019లో ఎలాగైనా పోటీ చేయాలనే దిశగా సమాయత్తమవుతున్నారు. కాగా, అధికారంలో ఉన్న టీడీపీ గానీ, ప్రతిపక్ష వైసీపీ గానీ ఎవరికి వారుగా రేసుగుర్రాలు వెతుక్కుంటున్నాయి. కాంగ్రెస్‌ మాత్రం తన ఉనికి చాటుకునే ప్రయత్నాల్లో భాగంగా రాజకీయ ప్రాబల్యం ఉన్న అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది. కొత్తగా రంగంలోకి వచ్చిన జనసేన ఇంకా తమ పార్టీకి ఎవరు బాధ్యులో నిర్ణయించలేదు. ఈ పరిస్థితుల్లో మన మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటో ఒకసారి చూద్దాం.మధుసూదన్‌ గుప్త 2009లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో గుంతకల్లు నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం ఆయనకు 2014లో టిక్కెట్‌ దక్కలేదు. ప్రస్తుతం ఆయన టీడీపీ టిక్కెట్టు రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సహకారంతో ఆ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటీవల అనంతపురంలో నిర్వహించిన ఎంపీల నిరసన దీక్షలో పాల్గొనడం ద్వారా ఆయన సైకిలెక్కేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం నుంచి 2004, 2009 సంవత్సరాల్లో కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా ఈయన గెలుపొందారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2019లో వైసీపీ టిక్కెట్‌ రేసులో ఉన్నారు. మెట్టు గోవిందరెడ్డి ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీగా పదవీకాలం ముగియడంతో వచ్చే ఎన్నికల్లో రాయదుర్గం టీడీపీ టిక్కెట్‌ కావాలని కోరుతున్నట్టు సమాచారం. గతంలో ఆయన టీడీపీ తరపున రాయదుర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ధర్మవరానికి చెందిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి 2009లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతర పరిణామాల్లో ఆయన వైసీపీలో చేరి 2014లో పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ధర్మవరం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సమాయత్తమవుతున్నారు. హిందూపురం నుంచి అబ్దుల్ ఘనీ 2009లో టీడీపీ తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఆయన తన సీటు త్యాగం చేసి నందమూరి బాలకృష్ణకు అవకాశమిచ్చారు. వచ్చే ఎన్నికలపై ఆయన స్తబ్ధుగా ఉంటున్నారు. హిందూపురానికి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు ప్రస్తుతం బీసీ కార్పొరేషన్‌ చైర్మ‌న్‌గా ఉంటున్నారు. అలాగే ఇంకో మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకట్రాముడు కూడా టీడీపీలో ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా బాలకృష్ణ పోటీ చేస్తే.. వీరందరూ రేసులో లేనట్లే.సుధాకర్‌ బాబు మడకశిరకు నుంచి 2009లో కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటివరకూ ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. 2014లో కాంగ్రెస్‌ తరపున పోటీచేసి ఓడిపోయారు. రఘువీరారెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్న సుధాకర్‌బాబు వచ్చే ఎన్నికల్లో మడకశిర కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలబడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. శైలజానాథ్‌ శింగనమల నుంచి 2009లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవి చేపట్టారు. అనంతరం 2014 ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ నిర్వీర్యం కావడంతో టీడీపీ టిక్కెట్టు కోసం చివరిదాకా ప్రయత్నించి విఫలమయ్యారు. తరువాత ఆయన కాంగ్రె్‌సలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడయ్యారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రె్‌సలోనే ఉంటారా? లేక గత ఎన్నికల్లో మాదిరి టీడీపీ టిక్కెట్టు రేసులో ఉంటారా? అనే అంశం ఇంకా స్పష్టం కాలేదు.అనంతపురం నుంచి గుర్నాథరెడ్డి 2009లో కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతర పరిణామాల్లో ఆయన వైసీపీలో చేరారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. తరువాత కొంతకాలానికి ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని గాడ్‌ఫాదర్‌గా ఎంచుకుని టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఈయనకు అహుడా చైర్మన్‌ పదవి ఖరారైందనే ప్రచారం జరిగింది. కానీ చడీచప్పుడూ లేకుండా పోయింది. ప్రస్తుతం ఎంపీ జేసీ కూడా ఎన్నికలు దగ్గరపడడంతో ఇతర నియోజకవర్గాలపై దృష్టి సారించారు. గుర్నాథరెడ్డి కూడా వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ తన పాతగూటికి చేరతారనే ప్రచారం జరుగుతోంది. తమ సోదరులు వైసీపీలోనే కొనసాగుతూండడం, తనకు టీడీపీలో పట్టు దొరకకపోవడం వంటి కారణాలతో ఆయన పునరాలోచనలో ఉన్నట్టు సమాచారం. కడపల మోహన్‌రెడ్డి పుట్టపర్తి నుంచి 2009లో కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత ఆయన వైసీపీలో చేరినా ఆ పార్టీ తరపున పోటీచేసే అవకాశం రాలేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తానేననే ప్రచారంతో సమాయత్తమవుతున్నారు.
కందికుంట వెంకటప్రసాద్‌ 2009లో టీడీపీ తరపున కదిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దివంగత నేత పరిటాల రవీంద్ర అనుచరుడిగా ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఇప్పటికీ పార్టీలో చురుగ్గా ఉంటూ కదిరి టీడీపీ శ్రేణులకు దగ్గరగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన తన సతీమణి యశోదమ్మను టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దించే అవకాశాలున్నట్టు సమాచారం.ఉరవకొండ నుంచి శివరామిరెడ్డి వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. గతంలో ఆయన కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. ప్రస్తుతం ఉరవకొండలో వైసీపీ ఎమ్మెల్యేగా విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. అయినా ఈసారి శివరామిరెడ్డి బరిలో నిలుస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.
ఆ ఒక్క ఛాన్స్ ఎవరికి..? https://www.telugumuchatlu.com/whos-that-chance/
Tags:Who’s that Chance?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *