గెలుపుపై ఎవరి ధీమా వారిదే

Date:18/04/2019
 నెలూరు ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైలెంట్ వేవ్ ఉందన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయం. వివిధ సంస్థల ద్వారా చేయించిన సర్వేలు, క్యాడర్ నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి అత్యధికంగా 120 సీట్లు అత్యల్పంగా 95 స్థానాలు టీడీపీకి వచ్చే అవకాశాలున్నాయన్నది వారి అంచనా. ఈ అంచనాకు కూడా కొన్ని ఉదాహరణలు చెబుతున్నారు. తామేమీ గాలి లెక్కలు వేయడం లేదని బలమైన కారణాలున్నాయంటున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఓట్లు గంపగుత్తగా తమకే పడ్డాయన్నది వారి వాదన.ఈ నెల 11వ తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అర్థరాత్రి 4గంటల వరకూ పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ కేంద్రాల వద్ద గంటల కొద్దీ మహిళలు, వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు నిరీక్షించారన్నది వాస్తవం. అధికార పార్టీని తిరిగి అందలమెక్కించాలన్న కసితోనే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే కాకుండా మహిళలు, వృద్ధులు ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆ పార్టీ పోస్ట్ మార్టంలో తేలింది. రాష్ట్రంలో ఎన్నికలకుముందు ప్రకటించిన సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో పనిచేశాయన్నది టీడీపీ నేతల విశ్వాసంగా కన్పిస్తోంది.తెలుగుదేశం పార్టీ నేతలు 120 నుంచి 95 స్థానాల వరకూ రావచ్చని చెబుతుంటే, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం 130 స్థానాలకు తగ్గదన్న ధీమాలో ఉన్నారు.పోలింగ్ సరళిని చూస్తే ఏ పోలింగ్ కేంద్రంలో చూసినా మహిళలు పెద్ద సంఖ్యలో కన్పించడం వారి ఆశలకు జీవం పోస్తోంది.
ప్రధానంగా పసుపు కుంకుమ పథకం పట్ల బాగా ఆకర్షితులయ్యారని, పింఛన్లు 200 నుంచి 2000 తీసుకున్న వృద్ధులు చంద్రబాబుకే ఓటేశారన్నది టీడీపీ నేతల వాదన. ఈవీఎంలు మొరాయించినా మహిళలు ఇంటికి వెళ్లి తిరిగి పోలింగ్ కేంద్రాలకు రావడం చంద్రబాబు ఇచ్చిన పిలుపే కారణమంటున్నారు.ఇక జనసేన వల్ల తమకు లాభం జరిగిందంటున్నారు. పవన్ కల్యాణ్ బరిలో లేకుంటే ఆ ఓట్లు వైసీపీకి పడేవని, ఇప్పుడు జనసేన రావడంతో ఆ ఓట్లను ఫ్యాన్ పార్టీ కోల్పోవల్సి వచ్చిందని తెలుగుదేశం పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గతంలో కంటే సీట్లు కొన్ని తగ్గినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ స్థానాలను సాధిస్తామని ఆప్రాంతానికి చెందిన సీనియర్ నేత ఒకరు విశ్లేషించారు. అక్కడ బలమైన కొన్ని సామాజిక వర్గాలు వైసీపికి ఓటు వేయలేదని, జనసేనకు వేయడం వల్ల అది తమకు లాభించిందని చెబుతున్నారు. నెల్లూరు, చిత్తూరు,ప్రకాశం జిల్లాల్లో గతంలో కంటే ఎక్కువ స్థానాలు సాధిస్తామని ఆ పార్టీ నేతలు నమ్మకంగా చెబుతున్నారు. సైలెంట్ వేవ్ తమను మరోసారి అధికారంలోకి తీసుకువస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Tags:Whose insights are on the win

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *