బాల‌రాజు క‌ల నెర‌వేరుతుందా

Date:18/09/2020

ఏలూరు ముచ్చట్లు:

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పోల‌వ‌రం ఎమ్మెల్యే తెల్ల బాల‌రాజు క‌ల నెర‌వేరుతుందా ? ఆయ‌న ఎప్పటి నుంచో ఆశ‌లు పెట్టుకున్న మంత్రి పీఠం ద‌క్కుతుందా ? ఆయ‌న అనుచ‌రులు త‌ర‌చుగా చ‌ర్చించుకునే విష‌యం ఇదే. ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గమైన పోల‌వ‌రంలో అజాత శ‌త్రువుగా ఉన్నారు బాల‌రాజు. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పిలుపుతో ఆయ‌న ప్రభుత్వ ఉద్యోగాన్ని ప‌క్కన పెట్టి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ త‌ర‌పున 2004, 2009 వ‌రుస ఎన్నిక‌ల్లో పోల‌వ‌రం నుంచి విజ‌యం సాధించారు. వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత‌.. బాల‌రాజు.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జ‌గ‌న్‌కు స‌న్నిహితుడైన నాయ‌కుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ క్రమంలోనే 2012లో జ‌రిగిన ఉప‌పోరులోనూ ఆయ‌న వైసీపీ తర‌ఫున విజ‌యం సాధించారు. ఈ ఉప ఎన్నిక‌ల్లో బాల‌రాజుకు ఏకంగా 40 వేల భారీ మెజార్టీ వ‌చ్చింది. ఆ టైంలోనే జ‌గ‌న్ బాల‌రాజును జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా నియ‌మించారు. బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాల ఆధిప‌త్యం ఉన్న జిల్లాలో ఓ ఎస్టీ నేత‌కు జిల్లా ప‌గ్గాలు ఇవ్వడం అప్ప‌ట్లో సంచ‌ల‌నం అయ్యింది.

 

ఇక‌, 2014 విష‌యానికి వ‌చ్చే స‌రికి ఆయ‌న ఓడిపోయారు. ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న వ్యతిరేక వ‌ర్గం బాల‌రాజుకు సీటు ఇవ్వొద్దని చెప్పింది. వైవీ సుబ్బారెడ్డి ప‌ట్టుబ‌ట్టి మ‌రీ బాల‌రాజుకు టికెట్ ఇప్పించారు. దీంతో ఆయ‌న గెలుపు న‌ల్లేరుపై న‌డ‌క‌మాదిరిగా మారింది. పార్టీలోను, నియోజ‌క‌వ‌ర్గంలోనూ త‌న‌కంటూ ప్రత్యేక‌త‌తో దూసుకుపోతున్నారు.గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో బాలరాజు దాదాపు 42 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు. నాలుగుసార్లు గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే కావ‌డంతో ఆయ‌న మంత్రి ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్నారు. జ‌గ‌న్ తొలికేబినెట్‌లోనే ఆయ‌న‌కు అవ‌కాశం వ‌స్తుంద‌ని అనుకున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నస‌మ‌యంలోనూ ఆయ‌న పార్టీని ప‌రుగులు పెట్టించ‌డం, చంద్రబాబు హ‌యాంలోనూ జిల్లాలో పార్టీని డెవ‌ల‌ప్ చేయ‌డం వంటివి బాల‌రాజుకు ప్లస్‌లుగా క‌లిసి వ‌చ్చాయి. అయితే, ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కలేదు.

 

బాల‌రాజు క‌న్నా చాలా జూనియ‌ర్ అయిన‌ కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణికి ఇచ్చారు.అయితే, ఇటీవ‌ల కాలంలో ఈమెపై కొంత అసంతృప్తి ఉంది. దీనికి తోడు మ‌రో ఏడాదిలో ఎలాగూ మంత్రి వ‌ర్గ పున‌ర్వ్యస్థీక‌ర‌ణ ఉంటుంద‌ని భావిస్తున్న నేప‌థ్యంలో ఈసారైన బాల‌రాజుకు అవ‌కాశం ద‌క్కుతుందా? అని అనుచ‌రులు చ‌ర్చించుకుంటున్నారు. తెలంగాణ నుంచి క‌లిసిన కుక్కునూరు, వేలేరుపాడు మండ‌లాల‌తో పోల‌వ‌రం అతిపెద్ద నియోజ‌క‌వ‌ర్గం అయ్యింది. స‌మ‌స్యలు కోకొల్లలుగా ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి అన్న ప‌ద‌మే విన‌ప‌డ‌డం లేదు. దీంతో ఏదో ఒక ప‌ద‌వి వ‌స్తే నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి చేసుకోవ‌చ్చన్న ఆశ బాల‌రాజులో ఉంది. ఆయ‌న మంత్రి ప‌ద‌వి ఖ‌చ్చితంగా వ‌స్తుంద‌నే ధీమాతో ఉన్నారు.అయితే, అదే స‌మ‌యంలో సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజ‌న్నదొర కూడా మంత్రి పీఠంపై క‌న్నేయ‌డంతో బాల‌రాజుకు ఆయ‌నే ప్రధాన అడ్డంకి అని చ‌ర్చించుకుంటున్నారు. ఆయ‌న కూడా ఎస్టీ కోటాలో నాలుగోసారి ఎమ్మెల్యేగా గెల‌వ‌డంతో పాటు సీనియ‌ర్‌గా ఉన్నారు. మ‌రి ఈనేప‌థ్యంలో జ‌గ‌న్ ఎవ‌రిని మంత్రి పీఠం ఎక్కిస్తారో చూడాలి. ఏదేమైనా.. బాల‌రాజు అనుచ‌రుల వ్యాఖ్యల‌ను బ‌ట్టి.. ఆయ‌న చేసిన కృషికి.. రావాల్సిన గుర్తింపు రాలేద‌ని అంటున్నారు.

 

మళ్లీ ఆగిన మల్లన్న సాగర్ పనులు

Tags:Will the child king’s deeds be fulfilled

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *