ఈబీసీ రిజర్వేషన్ బిల్లు కమలం పార్టీని విజేతగా నిలుపుతుందా?

Date:11/01/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తురుప ముక్కగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు భావిస్తున్న ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ బిల్లు కమలం పార్టీని విజేతగా నిలుపుతుందా? లేదంటే పరాజితగా మారుస్తుం దా?.. చివరి క్షణంలో ఆదరబాదరాగా తీసుకువచ్చిన ఈబీసీ బిల్లు అగ్ర కులాల మనస్సును గెలుచుకుంటుందా? లేదంటే వారి తిరస్కారానికి గురవుతుందా? అనే ప్రశ్నలకు మరి కొద్ది నెలల్లో సమాధానం లభించనున్నది. గతంలోనూ వివిధ సందర్భాల్లో ఆఖరి క్షణాల్లో బిల్లులను తీసుకువచ్చిన ఉదంతాలున్నాయి. కానీ, అవేమీ నాడు ఆయా పార్టీలకు ఓట్లు రాల్చలేదు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు తమను ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ డిమాండ్ చేసిన జాట్ల విన్నపాన్ని నాటి యూపీఏ ప్రభుత్వం మన్నించింది. అలాగే మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆ సామాజిక వర్గం చేసిన డిమాండ్‌కు అప్పటి మహారాష్ర్టలో కొలువుదీరిన కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ సర్కారు ఆమోదముద్ర వేసింది.
అయితే, ఇవేవీ తదుపరి ఎన్నికల్లో ఆ పార్టీలను గట్టెక్కించలేకపోయాయి. లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. జాట్లు, మరాఠాలు బీజేపీకే ఓటు వేసినట్లు ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ సరళిని బట్టి తెలుస్తున్నది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం తప్ప లేదు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలోని కఠిన నిబంధనలపై అగ్ర కులాలు గుర్రుగా ఉన్నాయి. ఈ చట్టంలోని మార్గదర్శకాలను సవరించేందుకు బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఈ చట్టాన్ని సాకుగా తీసుకుని తమపై కేసులు నమోదు చేస్తూ దుర్వినియోగం చేస్తున్నారని వారు కొంతకాలంగా ఆరోపిస్తున్నారు.
మరోవైపు అట్రాసిటీ చట్టంలో జోక్యం చేసుకుని నిబంధనలు మార్చేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని, బీజేపీ హయాంలో తమపై అణిచివేత ధోరణి కొనసాగుతున్నదంటూ దళితులు కాషాయ పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు. ఈబీసీ కోటా ద్వారా ఉత్తరాదిలో బలమైన వర్గాలైన జాట్లు, బనియాలు, పటేళ్లు, భూమిహార్, మరాఠా, బ్రాహ్మణ తదితర వర్గాల మనసు గెల్చుకునే దిశగా బీజేపీ పావులు కదిపింది. వీరిలో జాట్లు, పటేళ్లు, మరాఠాలు తమను ఓబీసీ జాబితాలో చేర్చాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ వర్గాలను ఓబీసీల్లో చేర్చితే .. ఇప్పటికే ఆ గ్రూపులో ఉన్న కులాలు ఆందోళనకు దిగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో నొప్పించక.. తానొవ్వక రీతిలో కేంద్రం జనరల్ కేటగిరీలోనే ఈబీసీలకు రిజర్వేషన్లు కల్పించింది.
Tags:Will the ECC Reservation Bill place the Kamalam Party as the winner?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *