భర్తపై వేడి నూనె పోసేసిన భార్య

Date:08/10/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
వ్యాపారంలో నష్టపోయి ఓ వ్యక్తి కుటుంబపోషణ భారం కావడంతో తిరిగి తన తల్లిదండ్రుల చెంతకు వెళ్లిపోదామంటే దీనికి భార్య అభ్యంతరం తెలిపింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిద్రపోతున్న భర్తపై ఆ ఇల్లాలు సలసల కాగుతోన్న నూనె కుమ్మరించింది. ఈ ఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కూకట్‌పల్లి భాగ్‌అమీర్‌కు చెందిన కుమార్‌చౌదరి, ప్రేమ్‌దేవిలకు పన్నెండేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. స్థానికంగా ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్న కుమార్‌చౌదరి వ్యాపారంలో బాగా నష్టపోయాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి కుటుంబం గడవడం కష్టంగా మారింది.
ఈ క్రమంలో తన తల్లిదండ్రులు ఉంటున్న ఇంటికి వెళ్లిపోదామని భార్యా పిల్లలకు కొద్ది రోజులుగా చెబుతున్నాడు. అయితే, దీనికి అంగీకరించని ప్రేమ్‌దేవి, భర్తతో గొడవ పడింది. ఈ విషయంలో దంపతుల మధ్య వివాదం కొనసాగుతోంది. కుమార్‌చౌదరి ఎక్కువ సమయం తన తల్లిదండ్రుల వద్దే గడపడంతో భార్య ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో శనివారం తన ఇంటికి వచ్చిన కుమార్‌‌తో భార్య మరోసారి గొడవపడింది. గొడవ తర్వాత రాత్రి నిద్రపోతున్నాడు.
ఇదే అవకాశంగా భావించిన ప్రేమ్‌దేవి, ఆదివారం తెల్లవారుజామున సలసల కాగే నూనె తీసుకొచ్చి అతడిపై పోసింది. దీంతో కుమార్‌చౌదరి కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాలు కాలిపోయాయి. కుమార్‌ శరీరం 45శాతం కాలిపోవడంతో ప్రస్తుతం ఓ ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
Tags:Woman heated hot oil on her husband

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *