చకచకా సాగిపోతున్న యాదాద్రి పనులు

నల్గొండముచ్చట్లు:

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ పునర్నిర్మాణంలో భాగంగా అభివృద్ధి చేస్తున్న శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయ పనులు తుది దశకు చేరాయి. కరోనా విపత్తులోనూ శిల్పులు, కూలీలు ఆలయ పనుల్లో నిమగ్నమై పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. సుమారు రూ.15 కోట్ల వ్యయంతో ఎకరం స్థలంలో కృష్ణశిలతో ఈ శివాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రధానాలయం, ముఖమండపం, ప్రాకార మండపం, రాజగోపురం పనులు పూర్తయ్యాయి.ఇక ప్రధానాలయం పక్కనే ఉప ఆలయాలైన గణపతి, పర్వతవర్ధిని అమ్మవారి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయాన్ని పూర్తి చేశారు. అంతే కాకుండా నవగ్రహ మండపం, యాగశాలను సైతం ఇటీవలనే శిల్పులు పూర్తి చేశారు. ప్రధానాలయంలోని మండపాలు, నాలుగు దిశల్లో కృష్ణ శిలలతో ఫ్లోరింగ్‌ పనులు చేశారు. ప్రధానాలయం ముందుభాగంలో బలిపీఠం, ధ్వజస్తంభం ఏర్పాటు చేసేందుకు దిమ్మెలు పూర్తి చేశారు. ఆలయంలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు కూడా పూర్తయ్యాయి. ఆలయ పునఃప్రారంభం సమయానికల్లా స్పటికలింగాన్ని ఏర్పాటు చేసేందుకు ఇటీవల వైటీడీఏ అధికారులు మార్కింగ్‌ చేశారు.వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఆర్కిటెక్టు ఆనంద్‌సాయి, ఈఓ గీతారెడ్డి పర్యవేక్షణలో శిల్పాల పనులు పూర్తయ్యాయి. ప్రధానాలయ మండపాల ప్రకారాల్లోని సాలహారాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలు, శివుడి అవతారాలు, పార్వతి అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇక ముఖ మండపంలో దక్షణామూర్తి, బ్రహ్మ, భైరవులతో పాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలను అమర్చేందుకు ఆలయ శిల్పులు సన్నాహాలు చేస్తున్నారు.రామలింగేశ్వరస్వామి ఆలయంలో కల్యాణమండపం, రథశాలను ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. ఆలయంలోని ఉత్తర దిశలో కల్యాణ మండపాన్ని, రథశాలను ఏర్పాటు చేసేందుకు ఇటీవల మార్కింగ్‌ చేశారు. ఈ పనులను త్వరలోనే చేపట్టనున్నారు. అంతే కాకుండా దక్షిణ భాగంలో ఇంకా మిగిలి ఉన్న ప్రాంతంలో కృష్ణ శిలలతో స్టోన్‌ ఫ్లోరింగ్‌ పనులు చేస్తున్నారు. ఇక ప్రాకారాలపై అందంగా కనిపించే విధంగా నంది విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఆలయంలో విద్యుదీకరణ పనులు చేయాల్సి ఉంది.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Yadadri works going smoothly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *