వరద ముంపులో యానాం.. ఆకలి దప్పులతో జనం హాహాకారాలు

యానాం ముచ్చట్లు:


గోదావరి మహోగ్ర రూపం యానాం వాసులను అతలాకుతలం చేసేసింది. యానాంకు వరద పోటు ఏటా ఉండేదే. అయినా గోదారి తల్లికి మామీద అనుగ్రహమే కానీ ఆగ్రహం లేదు అన్నది అక్కడి వారి నమ్మకం, విశ్వాసం. అలాగే ఈ వరద కూడా అనుకున్నారు. కానీ కనీవినీ ఎరుగని రీతిలో వచ్చిన వరద యానాం వాసుల నమ్మకాన్ని వమ్ము చేసేసింది. ఏటా ఉండేదా కదా అని ఇళ్లల్లోనే ఉండిపోయిన వారు వరద ఉగ్రరూపాన్ని చూసి వణికి పోతున్నారు. గుడారాల్లోనూ, తమ నివాసాల డాబాలపైకి చేరి ప్రాణాలనైతే కాపాడుకున్నారు కానీ, తిండీ, నీరు లేక అల్లాడిపోతున్నారు.   భారీ వరదల కారణంగా గోదావరికి చేరువలో ఉన్న ఎనిమిది గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. పలు కాలనీల్లో నడుములోతు నీరు చేరింది. గోదావరి పాయ అయిన గౌతమీ నది ఉద్ధృతితో యానాంలో కాలనీలు నీట మునిగాయి. పలు కాలనీలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.అడుగు బయట పెట్టలేని పరిస్థితి.. అక్కడ పరిస్థితి రాత్రికి రాత్రే మారిపోయింది. ప్రశాంతంగా నిద్రపోతున్న ప్రజలపై వరద ఒక్కసారిగా విరుచుకుపడింది. అర్ధరాత్రి నీరు రావడంతో ఉలిక్కి పడిన ప్రజలు సూర్యోదయం వరకు బిక్కుబిక్కుమంటు గోడలు, డాబాలపై కంటిమీద కునుకు లేకుండా కూర్చున్నారు.ఆకలితో ఆపన్న హస్తం ఎదురు చూసిన వారికి మాజీ ఎమ్మెల్యే మల్లాది కృష్ణారావుతో పాటు పలు స్వచ్చంద సంస్థలు సహాయం చేస్తునా, ఆ  సాయం పరిమితమే. అది కొందరికే అందుతోంది.

 మరోవైపు రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కనీసం తమని పరామర్శించడానికి రాలేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  తము కట్టుబట్టలతో మిగిలిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  గోదావరి నదిలో నీరు తగ్గడంతో పలు గ్రామాల్లో వరద 2 అడుగులు మేర తగ్గింది.  అయినప్పటికీ ఇంకా అనేక ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. రాజోలు, మామిడికుదురు, సఖినేటిపల్లి, పి.గన్నవరం, అయినవిల్లి  మండలాల్లోని పలు గ్రామాల్లోని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఏకంగా మామిడి కుదురు మండలంలోని లంక గ్రామ వరద బాధితులు భోజనాల కోసం ఘర్షణ పడే పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు.  ఆకలితో అలమటిస్తున్న బాధితుల ఆపన్నహస్తం అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న విమర్శలు వినవస్తున్నాయి.పెదపట్నం లంక గ్రామంలో వరద బాధితులకు గత ఆరు రోజులుగా కనీసం మంచినీళ్లు అందలేదని చెబుతున్నారు.  గత వారం రోజులగా వరద ముంపులోనే పీక లోతు నీటిలో ఆకలితో అలమటిస్తున్నామని,మమ్మల్ని పట్టించుకునే నాధుడే లేరని లంక గ్రామాల్లోని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల స్పందన సరిగా లేదంటూ విమర్శిస్తున్నారు. ప్రభుత్వం తమను గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Tags: Yanam in the flood

Leave A Reply

Your email address will not be published.