Natyam ad

యనమల వర్సెస్ చిన రాజప్ప

కాకినాడ   ముచ్చట్లు:


పిల్లి అనంతలక్ష్మి. కాకినాడ రూరల్ నుంచి టీడీపీ తరఫున రెండుసార్లు పోటీ చేస్తే ఒకసారి గెలిచారు. అంతకు ముందు అనంతలక్ష్మి భర్త పోటీ చేసి ఓడిపోయారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత కుటుంబంలో కలహాలు వచ్చాయి. ఆ కలహాలకు పార్టీ నేతలు కోరస్ ఇచ్చారని.. కనీసం అధిష్టానం వారిని పిలిచి మందలించలేదని రెండేళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు పిల్లి దంపతులు. దీంతో ఈ రెండేళ్లు నియోజకవర్గంలో టీడీపీని నడిపించే నాయకుడు లేకుండా పోయాడు. ఏమైందో ఏమో వారం కిందట పిల్లి ఫ్యామిలీ పార్టీ పెద్దలను అందరిని కలిసి వచ్చింది. ఇక టికెట్ తమదేనని జోరుగా ప్రచారం చేస్తోంది కూడా.పిల్లి ఫ్యామిలీకి ముందు నుంచి టీడీపీ సీనియర్‌ నేత యనమల సపోర్ట్ ఉంది. ఆయనే తెర వెనక మంత్రాంగం నడిపారని చర్చ. గతంలో కాకినాడ రూరల్‌కు టీడీపీ ఇంఛార్జిగా ఎవరిని నియమించాలనేదానిపై కమిటీ వేశారు. ఆ కమిటీతో రెండు రోజుల కిందట జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ పెద్దలు సమావేశం అయ్యారు.

 

 

 

అక్కడ ఆసక్తికర చర్చ తెరమీదకు తీసుకొచ్చింది పిల్లి వ్యతిరేకవర్గం. గత ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కచోట మినహా.. మిగతా ఆరు సెగ్మెంట్లను కాపులకు కేటాయించింది వైసీపీ. టిడిపి మూడు బీసీ, మూడు కాపు.. ఒకచోట క్షత్రియ సామాజికవర్గం అభ్యర్థులను బరిలోకి దింపింది. ఈ లెక్కలను ముందు పెట్టి కాకినాడ లోక్‌సభ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో కాపు ఓట్లు కీలకమని.. ఆ వర్గంలో దానిపై అసంతృప్తి ఉందని.. పార్టీ పెద్దలకు తెలిపారట.మరో సమీకరణాన్ని కూడా టీడీపీ నేతలు ప్రస్తావించినట్టు సమాచారం. టీడీపీ ఆవిర్భావం నుంచి కాకినాడ రూరల్ పక్కన ఉన్న రామచంద్రపురం టికెట్ కాపులకు కేటాయిస్తూ వస్తున్నారు. మారిన పరిణామాలతో అక్కడ ఇంఛార్జిగా శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని నియమించింది టీడీపీ. మరోపక్క కాకినాడ అర్బన్‌కు బీసీ వర్గానికి చెందిన వనమాడి కొండబాబు ఇంఛార్జిగా ఉన్నారు. వీటన్నిటిని హైలెట్ చేస్తూ ఇలా అయితే సమతుల్యత ఎక్కడ ఉంటుందని గట్టిగానే కౌంటర్ ఇచ్చారట పిల్లి వ్యతిరేకవర్గం. ఆ మాటలు వినగానే పిల్లి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

 

 

Post Midle

రెండు వర్గాలు పోటాపోటీ నినాదాలు చేస్తూ ఆఫీసులోకి చొచ్చుకెళ్లడంతో కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది.రెండేళ్లుగా కాకినాడ రూరల్‌కు పిల్లి ఫ్యామిలీ దూరంగా ఉండటంతో.. ఇక్కడ పార్టీ టికెట్‌ను ఆశించేవాళ్లూ పెరిగారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, మాజీ మేయర్ సుంకర పావని, కొత్తగా పార్టీలో చేరిన ముద్రగడ ప్రధాన అనుచరుడు వాసిరెడ్డి ఏసుదాసు, పార్టీ నేత పేరాబత్తుల రాజశేఖర్ తమ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నలుగురూ కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు. పిల్లి ఫ్యామిలీ రీఎంట్రీతో వీళ్లంతా ఏకతాటిపైకి వచ్చారని సమాచారం. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాడి వదిలేసి.. ఇప్పుడు సెంటిమెంట్‌ చూపిస్తే సరిపోతుందా అని వారు ప్రశ్నిస్తున్నారట.పిల్లి వ్యతిరేకవర్గం వెనక మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్పట్లో చినరాజప్పతో తేడా వచ్చిన తర్వాతే పిల్లి అనంతలక్ష్మి కుటుంబం దూరంగా ఉందట. వాళ్లు తిరిగి పార్టీలో యాక్టివ్‌ కాకుండా విశ్వ ప్రయత్నాలు చేశారట. ఇప్పుడు సమావేశంలో ఆ వర్గపోరు బయటపడింది. రణరంగానికి ఏకంగా పార్టీ ఆఫీసునే వేదికగా చేసేసుకున్నారు. తాజా పరిణామాలతో కాకినాడ రూరల్‌లో సైకిల్‌ హ్యాండిల్‌ను పార్టీ పెద్దలు ఎవరి చేతుల్లో పెడతారో.. ఈ రగడకు ఏ విధంగా ఎండ్‌కార్డు పడుతుందో చూడాలి.

 

Tags: Yanamala vs. Chinna Rajappa

Post Midle