రోడ్డున పడ్డ వైసీపీ కార్యకర్తలు

https://www.telugumuchatlu.com/sarkar-who-deals-with-real-estate/

https://www.telugumuchatlu.com/sarkar-who-deals-with-real-estate/

Date:10/11/2018
విజయవాడ ముచ్చట్లు:
పెడన నియోజకవర్గ వైఎస్‌ఆర్ సీపీలోని వర్గ పోరు రోడ్డెక్కింది. జోగి రమేష్ వర్గం, ఉప్పాల రాంప్రసాద్ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. 2014 ఎన్నికలు అయిన దగ్గర నుంచి పెడన నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్‌గా ఉప్పాల రాంప్రసాద్ అనే వ్యక్తి కొనసాగుతున్నారు. ఇటీవల మారిన సమీకరణాల నేపథ్యంలో మైలవరం నియోజకవర్గానికి చెందిన జోగి రమేష్ అనే వ్యక్తిని పెడన నియోజకవర్గానికి జగన్ పంపించారు.
దీంతో ఇద్దరి మధ్య అధిపత్యపోరు నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉప్పాల రాంప్రసాద్ వర్గాల మధ్య ఉన్న వైరం కొట్లాటకు దారి తీసింది. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త వల్లభనేని బాలశౌరి కార్యాలయ ప్రారంభోత్సవం ఇరువర్గాల మధ్య ఉన్న వైరాన్ని బహిర్గతం చేసింది. మచిలీపట్నంలో బాలశౌరి కార్యాలయ ప్రారంభోత్సవానికి వెళుతున్న ఇరు వర్గాలు కవ్వింపు చర్యలకు పాల్పడి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
ఈ దాడిలో ఉప్పాల వర్గీయులు జోగి రమేష్ కారు అద్దాలను ధ్వంసం చేశారు. దీనికి ప్రతిగా జోగి రమేష్ వర్గీయులు ఉప్పాల వర్గీయులపై భౌతికదాడికి దిగారు. ఈ దాడిలో భిట్టు అనే కార్యకర్త చెయ్యి విరిగింది. ఒకరిపై ఒకరు ముష్టియుద్ధం చేసుకున్నారు. పిడు గుద్దులతో పాటు జెండా కర్రలతో కొట్టుకున్నారు. ఒకానొక దశలో అసలేం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. రంగ ప్రవేశం చేసిన పోలీసులపై కూడా కార్యకర్తలు ఎదురు దాడికి పాల్పడిన పని చేశారు. పోలీసులు లాఠీ చార్జీ చేస్తున్నా ఏ మాత్రం లెక్క చేయకుండా ఇరువర్గాలు కొట్లాడుకున్నారు. మచిలీపట్నం నుండి అదనపు పోలీసు బలగాలు పెడన చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. ఇరువర్గాలను చెల్లా చెదురు చేశారు.
పట్టణంలో 144 సెక్షన్‌ను విధించారు. బంటుమిల్లి రోడ్డు, బస్టాండ్ సెంటరులో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. జోగి రమేష్ కారు అద్దాలను ధ్వంసం చేసిన ఉప్పాల వర్గీయుడిని గుర్తించిన పోలీసులు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాలను ఉప్పాల రాంప్రసాద్ తనయుడు, రాష్ట్ర యువజన విభాగం నాయకుడు ఉప్పాల రాము అడ్డుకున్నాడు. ఘర్షణకు మూల కారణం జోగి రమేష్ పీఎ ఆరేపల్లి రాము అని అతన్ని వెంటనే అరెస్టు చేయాలని ఉప్పాల వర్గం డిమాండ్ చేసింది.
పరిస్థితి ఉద్రిక్తతగా మారటంతో అప్పటికే జోగి రమేష్ అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయారు. రాంప్రసాద్‌తో పాటు ఆయన వర్గీయులు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. జోగి రమేష్ వర్గీయులు కూడా స్టేషన్‌కు వచ్చి పోలీసులకు జరిగిన విషయాన్ని వివరించారు. జోగి రమేష్ వ్యవహార శైలిని ఉప్పాల వర్గీయులు రాము, చంద్రశేఖర్ తదితరులు తీవ్రంగా ఖండించారు. పరుష పదజాలంతో ఉప్పాల రాము జోగి రమేష్ మీద ధ్వజమెత్తారు. సుమారు రెండు మూడు గంటల పాటు ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది.
Tags; YCP activists on the road

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed