సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా

Yeddyurappa resigned as CM

Yeddyurappa resigned as CM

– మాదగ్గర 104 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు
 – కాబట్టి బలపరీక్షలో మేం విఫలమయ్యామని ప్రకటన
Date:19/05/2018
బెంగళూరు ముచ్చట్లు:
కర్ణాటక విధానసౌధలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప.. విశ్వాస పరీక్ష తీర్మానాన్ని మధ్యాహ్నం 3.40 గంటల సమయంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం యడ్యూరప్ప ఆవేదనపూరిత ప్రసంగం చేశారు. ప్రజల కన్నీళ్లు తుడుద్దామనుకున్నాని ఆవేదన చెందారు యడ్డీ. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించారని తెలిపారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించదు అని చెప్పారు. బీజేపీకి మద్దతు ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు యడ్యూరప్ప.ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ ఎత్తున ప్రచారం చేశామని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వాల వైఫల్యాల కారణంగా ప్రజలు తమను 104 స్థానాల్లో గెలిపించారని చెప్పారు. కాంగ్రెస్,జేడీఎస్ పార్టీలు ఎన్నికల్లో ఓడిపోయాయని గుర్తు చేశారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన మమ్మల్ని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. కాంగ్రెస్, జేడీఎస్ తెరచాటు రాజకీయాలను ఖండిస్తున్నానని యడ్యూరప్ప చెప్పారు. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించడం బాధాకరమన్నారు.కాంగ్రెస్ ను కర్నాటక ప్రజలు తిరస్కరించారని యడ్యూరప్ప పేర్కొన్నారు. గత రెండేళ్లుగా రాష్ర్టంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించాను. గత ప్రభుత్వ పాలనలో ప్రజలు అనుభవిస్తున్న బాధలను వాళ్ల కళ్లలో చూశాను అని ఆవేదనపూరిత ప్రసంగం చేశారు యడ్డీ. ప్రజలు తనపై చూపిన ప్రేమ,అభిమానాలను మరువలేను. రాష్ర్టంలో రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేశాను. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లు అయినా తాగునీటికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. గడిచిన ఐదేళ్లలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని యడ్డీ తెలిపారు. చివరి ఊపిరి ఉన్నంత వరకు రైతుల బాగు కోసం తన జీవితాన్ని అంకితం చేస్తాను అని యడ్యూరప్ప స్పష్టం చేశారు. ‘‘ఇది నిజంగా అగ్నిపరీక్ష. ఇలాంటి పరీక్షలు ఎన్నో నా జీవితంలో ఎదుర్కొన్నాను. గతంలో రాష్ట్రం కోసం ఎంతో చేశాను. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టంకట్టారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌లను ఓటర్లు విశ్వసించలేదు. కానీ ఇవాళ వారు అపవిత్రపొత్తుతో ముందుకొచ్చారు. అవును. మాదగ్గర 104 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కాబట్టి బలపరీక్షలో మేం విఫలమయ్యాం అని చెప్పడానికి చింతిస్తున్నాం. అయితే నా ఆఖరి శ్వాస వరకు రాష్ట్రం కోసం పాటుపడతా. 2019లో 28కి 28 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటాం’’ అని యడ్యూరప్ప చెప్పారు. అనంతరమే ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
యెడ్యూరప్ప రాజీనామా చేయడంతో జేడీఎస్ నాయకుడు కుమార స్వామి కర్నాటక కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నేడో, రేపో ఆహ్వానించే అవకాశం ఉంది. యెడ్యూరప్ప బల పరీక్షకు ముందే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సభ నుంచి నేరుగా గవర్నర్ నివాసానికి బయలు దేరి వెళ్లారు. ఆయనతో పాటే బీజేపీ సభ్యులంతా బయటకు వెళ్లిపోయారు. కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులు మాత్రం సభలోనే ఉండి ఒకరినొకరు అభినందించుకుంటూ విక్టరీ సింబల్ చూపుతూ ఆనందం పంచుకుంటున్నారు.
Tags: Yeddyurappa resigned as CM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *