దేశవ్యాప్తంగా మీ టూ ఉద్యమం

Date:09/10/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతోంది. తమతో అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రముఖుల గుట్టును మహిళా జర్నలిస్ట్‌లు వెలుగులోకి తీసుకొస్తున్నారు. హాలీవుడ్‌లో సెగలు పుట్టించిన ఈ మీటూ ఉద్యమం, నేడు మీడియాలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ ఉద్యమ తాకిడి కేంద్ర ప్రభుత్వాన్ని తాకింది. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి, మాజీ ఎడిటర్‌ ఎంజే అక్బర్‌పై మహిళా జర్నలిస్ట్‌లు లైంగిక ఆరోపణలు చేస్తున్నారు.
హోటల్‌ రూమ్‌ల్లో ఇంటర్వ్యూ నిర్వహించే సమయంలో, పని గురించే చర్చించే సమయంలో మహిళా జర్నలిస్ట్‌లతో ఆయన అసభ్యకరంగా వ్యహరించినట్టు తెలిసింది. ప్రియ రమణి అనే జర్నలిస్ట్‌ తొలుత అక్బర్‌ ఆకృత్యాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ అనంతరం పలువురు మహిళా జర్నలిస్ట్‌లు కూడా అక్బర్‌పై లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. ప్రియ రమణి గతేడాదే ఓ మ్యాగజైన్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. కానీ ఆ సమయంలో పేరును బహిర్గతం చేయలేదు.
తాజాగా అక్బరే తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ధృవీకరిస్తూ… ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌ ఒక్కసారిగా సంచలనంగా మారింది. అక్బర్‌ అసభ్యకరంగా ఫోన్‌ కాల్స్‌చేయడంలోనూ, టెక్ట్స్‌లు పంపించడంలోనూ, అసౌకర్యమైన పొగడ్తలు కురిపించడంలో నిపుణుడని రమణి గతేడాదే తన ఆర్టికల్‌లో పేర్కొన్నారు. తనకు 23 ఏళ్ల వయసున్నప్పుడు, దక్షిణ ముంబై హోటల్‌కు తనను జాబ్‌ ఇంటర్వ్యూకి పిలిచి ఎలా అసభ్యకరంగా ప్రవర్తించాడో తెలిపారు. అయితే ఆ సమయంలో పేరును వెల్లడించలేదు. తనను మద్యం సేవించాల్సిందిగా ఒత్తిడి చేయడంతోపాటు దగ్గరగా కూర్చోవాలని చెప్పారని ఆమె ఆరోపించారు.
ఎలాగో అలా ఆ రాత్రి అక్బర్‌ నుంచి తప్పించుకున్నానని చెప్పారు. ప్రియ రమణి ట్వీట్‌ తర్వాత పలువురు జర్నలిస్టులు కూడా అక్బర్‌పై లైంగిక ఆరోపణలు చేశారు. తనతో 17 ఏళ్ల కిందట అక్బర్ ఇలాగే ప్రవర్తించారని, అయితే తన దగ్గర ఆధారాలేమీ లేకపోవడంతో బయటకు రాలేదని ప్రేరణ సింగ్ బింద్రా కూడా ట్వీట్ చేశారు.
అక్బర్‌ ప్రస్తుతం నైజిరియాలో ఉండటంతో, ఆయన ఈ ఆరోపణలపై స్పందించలేదు. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను అక్బర్‌పై వస్తున్న ఆరోపణలపై ప్రశ్నించగా.. ఆమె ఏమీ పట్టనట్లు వెళ్లిపోవడం గమనార్హం. ఇవి చాలా తీవ్రమైన ఆరోపణలు.. ఇవి లైంగిక ఆరోపణలు. మీరు ఆయన శాఖకు ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఈ ఆరోపణలపై విచారణ ఉంటుందా అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. సుష్మా మాత్రం స్పందించకుండా వెళ్లిపోయారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఎంజే అక్బర్‌, ది టెలిగ్రాఫ్‌, ఆసియన్‌ ఏజ్‌, ది సండే గార్డియన్‌ వంటి ప్రముఖ వార్తా పత్రికలకు ఎడిటర్‌గా వ్యహరించారు.
Tags: Your too movement across the country

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *