భూమానాగిరెడ్డి ఫ్యామిలిలో విబేధాలు

కర్నులు  ముచ్చట్లు:


భూమా నాగిరెడ్డి కుటుంబం రోడ్డుకెక్కింది. తన అక్కలు తనను మోసం చేశారంటూ భూమా నాగిరెడ్డి తనయుడు జగద్విఖ్యాత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కుటుంబంలో తగాదాలు బయటపడ్డాయి. తాను మైనర్ గా ఉన్నప్పుడు తన తండ్రి సంపాదంచిన ఆస్తులను అమ్మేశారంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో వెయ్యి గజాలను తన ప్రమేయం లేకుండా విక్రయించారని జగద్విఖ్యాతరెడ్డి తన అక్కలైన భూమా అఖిలప్రియ, భూమా నాగ మౌనికలపై ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో మరో సారి భూమా కుటుంబంలో వివాదాలు రోడ్డుకెక్కాయి. ఆస్తి కోసం వీధికెక్కారు. భూమా నాగిరెడ్డి 2017 మార్చి లో మరణించాడు. ఆయన అకస్మాత్తుగా గుండెపోటుకు గురయి మరణించడంతో ఎవరికీ ఆస్తుల పంపకం చేయలేదు. అప్పటికి భూమా అఖిలప్రియ, నాగ మౌనికలు ఇద్దరే మేజర్లు. విఖ్యాత్ రెడ్డి మాత్రం మైనర్ గా ఉన్నాడు. అయితే నాగిరెడ్డి మరణం తర్వాత హైదరాబాద్, కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, బెంగళూరులో ఉన్న ఆస్తుల వివరాలను అక్కచెల్లెళ్లు ఇద్దరే దగ్గరుండి పర్యవేక్షించారు. తన తండ్రి నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డిని బినామీగా పెడితే ఆయన ఆస్తులు కాజేశాడని కూడా ఆరోపించారు.

 

 

దీంతో ఏవీ సుబ్బారెడ్డి భూమా కుటుంబానికి దూరమయ్యారు.అయితే తాజాగా రాజేంద్రనగర్ లోని వెయ్యి గజాల స్థలం విక్రయాన్ని గుర్తించిన విఖ్యాత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తన అక్క లిద్దరూ ఆస్తులను తనకు సంబంధం లేకుండా విక్రయించారని పేర్కొంటూ కొనుగోలుదారులపైనా, అక్కలిద్దరిపైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో భూమా కుటుంబం రచ్చ కెక్కింది. భూమా అఖిలప్రియ వివాహం చేసుకున్న తర్వాతనే ఆ కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. తన బావ తమ ఆస్తులను కాజేస్తున్నాడని విఖ్యాత్ రెడ్డి సన్నిహితుల వద్ద ఆరోపిస్తున్నారు.మరోవైపు భూమా నాగిరెడ్డికి తానే అసలైన రాజకీయ వారసుడినంటూ ముందుకొస్తున్నారు. 2024 ఎన్నికల్లో తాను ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే ఇందుకు భూమా అఖిలప్రియ అంగీకరించడం లేదు. నంద్యాలకు వెళ్లి పోటీ చేయాలని అఖిల సూచించినా విఖ్యాత్ రెడ్డి మాత్రం ఆళ్లగడ్డనే ఎంచుకోవడంతో వివాదం ప్రారంభమయినట్లు సమాచారం. దీంతో మొన్నటి వరకూ అక్కలతో సాన్నిహిత్యంగా ఉన్న విఖ్యాత్ రెడ్డి ఇప్పుడు వేరు కుంపటి పెట్టారని తెలిసింది. అందుకే ఆయన ఆస్తులపై హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలున్నాయి.

 

Tags: Disagreements in the Bhumanagi Reddy family

Leave A Reply

Your email address will not be published.