Natyam ad

మడకశిరలో గ్రానైట్ దందా

అనంతపురం ముచ్చట్లు:


శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో దాదాపు 40 కలర్‌ గ్రానైట్, మెటల్‌ క్వారీలు ఉన్నాయి. అన్నీ కర్ణాటక సరిహద్దుల్లోనే ఉండడం నిర్వాహకులకు కలిసివస్తోంది. రాత్రికి రాత్రే సులభంగా విలువైన ఖనిజాన్ని సరిహద్దులు దాటిస్తున్నారు. అగళి మండలం పీ బ్యాడిగెర క్వారీల్లో తీసిన కలర్‌ గ్రానైట్‌ దిమ్మెలకు కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ డిమాండ్‌ ఉంటుంది. దక్షిణ భారతదేశంలోనే ఈ గ్రానైట్‌ చాలా నాణ్యమైంది. ఈ క్వారీల నిర్వాహకులు నెలకు రూ.కోట్లల్లో విలువ చేసే కలర్‌ గ్రానైట్‌ తరలిస్తారు. ఇందులో దాదాపు 50 శాతం అక్రమంగా రవాణా అవుతోంది.ఇక.. రొళ్ల మండలం హొట్టేబెట్ట వద్ద బుడ్డప్ప అనే వ్యక్తికి ప్రభుత్వం 3.09 ఎకరాల భూమికి డీపట్టా ఇచ్చింది. ఇందులో ఇతను ఎలాంటి అనుమతి పొందకుండా క్వారీ ప్రారంభించాడు. కర్ణాటకకు చెందిన వ్యక్తికి లీజుకిచ్చి కొన్ని నెలల పాటు అక్రమంగా కలర్‌ గ్రానైట్‌ దిమ్మెలు తీసి కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకున్నారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు వెళ్లి పనులను నిలిపివేశారు. మైనింగ్‌ అధికారులు మాత్రం  ఇంత వరకు చర్యలు తీసుకోలేదు.   మైనింగ్‌ చేయడానికి నిర్వాహకులు ముందుగానే గనులశాఖ నుంచి అనుమతి పొందాలి. అధికారులు క్యూబిక్‌ మీటర్ల ప్రకారం తవ్వకాలకు అనుమతి ఇస్తారు. హద్దులు కూడా నిర్ణయిస్తారు.

 

 

 

ఆ ప్రకారం ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించి మైనింగ్‌ చేసుకోవాలి. అయితే క్వారీ నిర్వాహకులు వందల క్యూబిక్‌ మీటర్లకు అనుమతి పొంది వేల క్యూబిక్‌ మీటర్లలో మైనింగ్‌ చేసిన సంఘటనలు ఇటీవల సీజ్‌ చేసిన క్వారీల్లో వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. మడకశిర కలర్‌ గ్రానైట్‌ చాలా నాణ్యంగా ఉంటుంది. దీంతో దీనికి చాలా డిమాండ్‌. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో మడకశిర గ్రానైట్‌ చాలా ప్రసిద్ధి. ఇతర దేశాలకు కూడా ఇక్కడి నుంచి ఎగుమతి అవుతోంది. రూ.కోట్లలో క్వారీ నిర్వాహకులకు ఆదాయం లభిస్తుంది. దీంతో అందరి కన్ను మడకశిర గ్రానైట్‌పైనే పడుతోంది.    మడకశిర ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై స్థానిక ఎమ్మెల్యే తిప్పేస్వామి ఇటీవల అమరావతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. గనులశాఖ డైరెక్టర్‌ వెంకటరెడ్డిని కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక మైనింగ్‌ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఎమ్మెల్యే వారి దృష్టికి తీసుకెళ్లారు.   విలువైన గ్రానైట్‌ సరిహద్దులు దాటుతున్నా మైనింగ్‌ శాఖ పత్తా లేదు. అక్రమ మైనింగ్‌పై స్థానిక పోలీసులే ఎక్కువ కేసులు నమోదు చేశారు. ఇటీవల కాలంలో మైనింగ్‌శాఖ అధికారులు పెద్దగా కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో మడకశిర ప్రాంతంలోని క్వారీలపై మైనింగ్‌శాఖ అధికారులు పెద్ద ఎత్తున దాడులు చేశారు. అక్రమంగా మైనింగ్‌ చేస్తున్న క్వారీలను సీజ్‌ చేసి రూ.కోట్లలో రాయల్టీ విధించారు. ప్రస్తుతం రూ. కోట్లల్లో అక్రమ రవాణా  సాగుతున్నా, అటువైపు కన్నెత్తి చూడడం లేదు.

 

Post Midle

Tags: Granite danda in Madakasira

Post Midle