Natyam ad

ఏజెన్సీ  గ్రామాల్లో  మావోల అలజడి

హైదరాబాద్ ముచ్చట్లు:


ఉమ్మడి ఆదిలాబాద్‌  అటవీ ప్రాంతంలో మళ్లీ అలజడి రేగుతోంది. మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు.అటవీ ప్రాంతాల్లో గాలింపును ముమ్మరం చేశారు. ఈ నెల 21 మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్‌ ఆధ్వర్యంలో నాగారం అటవీమార్గంలోని కల్వర్టులను తనిఖీ చేశారు. నాగారం, మంగణపల్లి గ్రామాల చుట్టు పక్కల ప్రాంతాల్లో స్పెషల్‌ పార్టీ, టీఎస్ఎస్పీ సిబ్బంది, స్థానిక పోలీసులతో కలిసి ఏరియా డామినేషన్‌ నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు తమకు పూర్తి సమాచారం ఉందని మంచిర్యాల ఇంఛార్జ్‌ డీసీపీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. స్థానికంగా ఉన్న యువతీ, యువకులు మావోయిస్టుల కార్యకలాపాలకు సహకరించి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. మావోయిస్టు ల వల్ల ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆకస్మిక వాహనాల తనిఖీలు, ఏరియా డామినేషన్స్‌, కల్వర్ట్‌ చెకింగ్‌లు, ఫెర్రీ పాయింట్స్‌ చెకింగ్స్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు.

 

 

 

మావోయిస్టు దళ సభ్యులు, అపరిచిత వ్యక్తుల సమాచారం తెలిస్తే స్థానిక పోలీస్‌ స్టేషన్ లో తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతామన్నారు. అంతేకాకుంకడా వారికి తగిన బహుమతి కూడా ఇస్తామని గ్రామస్తులకు తెలిపారు. ప్రధాన రహదారుల్లో వాహనాల తనిఖీ చేశారు. వారికి సంబంధించిన వివరాలు, వాళ్లు ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణిస్తున్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. మావోయిస్టుల అలజడి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెండేళ్లుగా ఎలాంటి కదలికలు లేకుండా ప్రశాంతంగా ఉన్న జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి.మావోయిస్టులు కొత్త దళ సభ్యుల రిక్రూట్ మెంట్ కోసం వచ్చారా లేక షెల్టర్ తీసుకోవడం కోసమా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు మొదలయ్యాయన్న ఇంటలిజెన్స్ వర్గాల సమాచారంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. మొత్తానికి ఏజెన్సీ గ్రామాల్లో మళ్లీ మావోయిస్టుల కదలికలతో ఎప్పుడేం జరుగుతుందోనని గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

 

Post Midle

Tags: Maoist agitation in agency villages

Post Midle