Natyam ad

భక్తులకు సహనంతో సేవలందించాలి- డాక్టర్ బివి.పట్టాభిరామ్

తిరుమల ముచ్చట్లు:

శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఉద్యోగులు సహనంతో సేవలు అందించాలని ప్రముఖ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బివి.పట్టాభిరామ్ సూచించారు. తిరుపతిలోని శ్వేత భవనంలో సోమవారం టీటీడీ ఉద్యోగులకు “విధినిర్వహణలో ఒత్తిడిని అధిగమించడం ఎలా” అనే అంశంపై డాక్టర్ పట్టాభిరామ్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులు ఒత్తిడిని అధిగమించేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇతరులు చేసే తప్పిదాలు, మనం చేసిన పనులకు ఫలితం ఆశించడం లాంటి మన ఆధీనంలో లేని కొన్ని పనుల వల్ల ఒత్తిడి పెరుగుతుందన్నారు. మన ఆలోచనలను, పని విధానాన్ని మార్చుకోవడం, ఇతరులతో గౌరవప్రదంగా మాట్లాడడం, గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకోవడం, ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం తదితర అంశాలు మన ఆధీనంలోనే ఉంటాయన్నారు. వీటిని చక్కగా ప్రణాళిక రూపొందించుకోవడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చని వివరించారు. ఉద్యోగులకు నైతిక ప్రవర్తన చాలా ముఖ్యమన్నారు. కొత్త విషయాలను నేర్చుకోవాలని, నిరంతరం వాటిని మెరుగుపరుచుకుంటూ ఉండాలని సూచించారు.

 

 

Post Midle

కుటుంబానికి మార్గదర్శగా ఉండాలన్నారు. కుటుంబ సభ్యులకు తగినంత సమయం కేటాయించాలని, ఆప్యాయంగా మాట్లాడాలని, నమ్మకం ఉంచాలని చెప్పారు. ఏ విషయంలో కూడా తొందరపడి వెంటనే తుది నిర్ణయానికి రాకూడదని, ఇతరులతో పోల్చుకుని తమను తాము తక్కువ అంచనా వేసుకోరాదని సూచించారు. క్షమాగుణం అలవర్చుకోవడం వల్ల మనశ్శాంతి కలుగుతుందన్నారు. ప్రతిరోజు ఉదయం ఐదు నిమిషాలు వజ్రాసనంలో కూర్చోవడం, నిటారుగా నిలబడి ఆకాశం వైపు చూడడం వల్ల ఒత్తిడి దూరమవుతుందన్నారు.శ్వేత సంచాలకులు శ్రీ భూమన్ మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులకు ఆరోగ్య విషయాలపై నిపుణులతో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల ఉద్యోగులు శేషాచలంలోని తీర్థాలను దర్శించుకునేలా త్వరలో ట్రెక్కింగ్ ఏర్పాటు చేస్తామన్నారు.అనంతరం ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీ సాయికృష్ణ యాచేంద్రతో కలిసి  భూమన్ శిక్షణకు హాజరైన ఉద్యోగులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, సీవీఎస్వో  నరసింహ కిషోర్, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి   శాస్త్రి, ఉద్యోగులు పాల్గొన్నారు.

 

Tags:Devotees should be served with patience – Dr. BV. Pattabhiram

Post Midle