Natyam ad

వైకుంఠ ఏకాద‌శికి విస్తృత ఏర్పాట్లు -టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుమ‌ల‌ ముచ్చట్లు:
 
తిరుమ‌ల‌లో జ‌న‌వ‌రి 13న వైకుంఠ ఏకాద‌శి, 14న ద్వాద‌శి సంద‌ర్భంగా భ‌క్తుల సౌక‌ర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శుక్ర‌వారం అన్ని విభాగాల అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.స‌మీక్ష అనంత‌రం ఈవో మాట్లాడుతూ జ‌న‌వ‌రి 13 నుండి 22వ తేదీ వ‌ర‌కు 10 రోజుల పాటు భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌న్నారు. జ‌న‌వ‌రి 13 వైకుంఠ ఏకాద‌శి నాడు ఉద‌యాత్పూర్వం కైంక‌ర్యాల అనంత‌రం ఉద‌యం 1.45 గంట‌ల నుండి ద‌ర్శ‌నం ప్రారంభ‌మ‌వుతుంద‌న్నారు. భ‌క్తుల సౌక‌ర్యార్థం ఇప్ప‌టికే ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్‌, శ్రీ‌వాణి, వ‌ర్చువ‌ల్ సేవా టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో విడుద‌ల చేసిన‌ట్టు చెప్పారు.గ‌తేడాది లాగానే తిరుప‌తిలోని ఐదు ప్రాంతాల్లో స్థానికుల కోసం స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్లు జారీ చేస్తామ‌న్నారు. ఒమిక్రాన్ వైర‌స్ విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో తిరుప‌తి స్థానికుల‌కు మాత్ర‌మే ముందు వ‌చ్చిన వారికి ముందు ప్రాతిప‌దిక‌న 10 రోజుల టోకెన్లు ఒకేసారి అందిస్తామ‌న్నారు. తిరుమ‌ల‌లో యాత్రికులు బ‌స చేసేందుకు దాదాపు 7500 పైగా గ‌దులు ఉండ‌గా ప్ర‌స్తుతం 1300 పైగా గ‌దుల పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని, ఈ కార‌ణంగా భ‌క్తులు వీలైనంత వ‌ర‌కు తిరుప‌తిలోనే గ‌దులు పొంది తిరుమ‌ల‌కు వ‌చ్చి స్వామివారి ద‌ర్శ‌నం చేసుకోవాల‌ని కోరారు.
 
 
వైకుంఠ ఏకాదశి నాడు ఉద‌యం స్వర్ణర‌థోత్స‌వాన్ని ప్ర‌త్య‌క్ష ప్రసారం చేయాల‌ని, ద్వాద‌శి నాడు ఉద‌యం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు చ‌క్ర‌స్నానం ఏకాంతంగా జ‌రుగుతుంద‌ని తెలిపారు. 6 ల‌క్ష‌ల ల‌డ్డూలు బ‌ఫ‌ర్ స్టాక్ ఉంచుకుంటామ‌ని, ల‌డ్డూ కాంప్లెక్స్‌లో ప్ర‌స్తుతం ప‌నిచేస్తున్న 31 కౌంట‌ర్ల‌కు బ‌దులుగా 41 కౌంట‌ర్లు ప‌ని చేస్తాయ‌ని వివ‌రించారు. అన్న‌ప్ర‌సాదం, క‌ల్యాణ‌క‌ట్ట, వ‌స‌తి క‌ల్ప‌న‌, వైద్యం, ఆరోగ్య విభాగంతోపాటు భ‌క్తుల తాకిడి ఉన్న అన్ని ప్రాంతాల్లో కోవిడ్ నిబంధ‌న‌లు త‌ప్ప‌క పాటించాల‌న్నారు. అన్ని విభాగాల్లో శ్రీవారి సేవకులు భక్తుల‌కు సేవ‌లందిస్తారని, తిరుమల‌లో పోలీసుల‌తో సమన్వయం చేసుకుని ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు.కోవిడ్ – 19 మూడ‌వ వేవ్ ఒమిక్రాన్ రూపంలో దేశ వ్యాప్తంగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో భ‌క్తులు వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాలని కోరారు. భ‌క్తులు త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు ధ‌రించి భౌతిక‌దూరం పాటించాల‌ని, త‌ర‌చూ శానిటైజ‌ర్‌తో చేతులు శుభ్ర‌ప‌రచుకోవాల‌ని అన్నారు. టిటిడి ఉద్యోగులు, వేలాది మంది సహ భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులు టిటిడి విజిలెన్స్ మరియు సెక్యూరిటి సిబ్బందికి స‌హ‌క‌రించాల‌ని కోరారు. అనంత‌రం ఉద్యాన‌వ‌నాల అభివృద్ధి ప‌నులు, ఘాట్ రోడ్డులో పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌పై స‌మీక్షించారు.ఈ స‌మీక్ష‌లో అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో  వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, ఎఫ్ఏసిఏవో  బాలాజి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ-2  జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఆరోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ శ్రీ‌దేవి, సిఎంవో డాక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌, డెప్యూటీ ఈవోలు  ర‌మేష్ బాబు,  లోక‌నాథం, భాస్క‌ర్‌,  సెల్వం,  ఎం.ప‌ద్మావ‌తి ఇతర విభాగాధిప‌తులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Extensive arrangements for Vaikuntha Ekadashi – TTD Evo Dr. KS Jawahar Reddy