కడప పర్యాటకానికి రాష్ట్ర అవార్డుతో గౌరవం
కడప ముచ్చట్లు:
వై.ఎస్.ఆర్. జిల్లా కేంద్రంగా పనిచేస్తున్న రాయలసీమ టూరిజం అండ్ కల్చరల్ సొసైటికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ పర్యాటక సంస్థ అవార్డు దక్కడం జిల్లాలోని పర్యాటక రంగానికి గౌరవం దక్కినట్లు అయిందని ఎమ్.ఎమ్. హాస్పిటల్స్ ఎండి డా. ఎస్. మహబూబ్ పీర్ అన్నారు. సోమవారం మానస ఇన్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య, పోతుల చిన్న ఓబుల్ రెడ్డి, కంచమ్మ, సరస్వతమ్మ స్మారక ట్రస్ట్‌లతో కలసి ‘కడప పర్యాటకానికి పట్టాభిషేకం’ అంశంపై సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డా. మహబూబ్ పీర్ మాట్లాడుతూ జిల్లాకు అవార్డు దక్కడం వెనుక సభ్యులందరి కృషి ఉందని ఈ అవార్డు మనకందరికి గర్వకారణమని రాయలసీమ స్థాయిలో ఇతర జిల్లాలకు కూడా అవార్డులు వచ్చేందుకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. సభాధ్యక్షులు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ కె. చిన్నప రెడ్డి మాట్లాడుతూ ఈ అవార్డు ద్వారా కడప జిల్లా పర్యాటక రంగానికి ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం లభిస్తాయన్నారు. పర్యాటకాభివృద్ధిలో జిల్లా అధికారుల కృషికి తమ సంస్థలు పూర్తిగా సహకరిస్తాయని తెలిపారు.
ఈ విజయంతో గండికోటకు యునెస్కో గుర్తింపు దక్కేంతవరకు కృషిచేయాలని సూచించారు. గండికోటలో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా బడ్జెట్ హోటళ్ళకు అవకాశం ఇవ్వాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. పోతుల ట్రస్ట్ చైర్మన్ పోతుల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ సంస్థ కృషి వృధా కాలేదని మరిన్ని అవార్డులకు స్ఫూర్తినిస్తోందన్నారు. లయన్స్ లాంటి సంస్థ సహకారం లభించడం మరింత గట్టిగా కృషిచేసేందుకు అవకాశాన్నిస్తోందన్నారు. లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షులు డా. ఆర్. రంగనాథ రెడ్డి మాట్లాడుతూ సంస్థ కృషిని గుర్తించి అవార్డునిచ్చి ప్రోత్సహిస్తున్నందుకు రాష్ట్ర పర్యాటక అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. లయన్ పద్మప్రియ చంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లా రచయితలనుంచి పర్యాటక రంగంపై మరిన్ని పుస్తకాలు రావాలని కోరారు. రాయలసీమ టూరిజం సంస్థ కోశాధికారి బాలగొండ గంగాధర్ మాట్లాడుతూ మన సంస్థ కృషి జిల్లాకు గర్వకారణంగా నిలవాల్సి ఉందన్నారు.

Tags: Honored with state award for Kadapa tourism
