సామాన్య భక్తులకు కేటాయించే గదుల అద్దె పెంచలేదు
-తిరుమలలో సామాన్య భక్తులకు పెద్దపీట
– డయల్ యువర్ ఈవోలో ఎవి.ధర్మారెడ్డి
తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే సామాన్య భక్తులకు వసతి, దర్శనం, ఇతర సదుపాయాలు అందించేందుకు టీటీడీ పెద్దపీట వేస్తోందని ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
1. సుబ్రహ్మణ్యం – కడప, వాణి – అనంతపురం
ప్రశ్న – తిరుమలలో సామాన్య భక్తులు బస చేసే రూ.50 , రూ 100 గదుల అద్దె పెంచకండి.
ఈవో – తిరుమలలో దాదాపు 45 వేల మందికి వసతి కల్పిస్తున్నాం.75 శాతం గదులను సామాన్య భక్తులకే కేటాయిస్తున్నాం. వారికి కేటాయించే గదుల అద్దె పెంచలేదు. ఇక మీదట కూడా పెంచే ఆలోచన లేదు . వీఐపీలకు కేటాయించే 172 అతిథి గృహాల అద్దె మాత్రమే పెంచాము.
2. పురుషోత్తం – కైకలూరు
ప్రశ్న – కైకలూరులో టీటీడీ కళ్యాణమండపం ఆధునీకరించాలి.
ఈవో – టీటీడీ నిర్వహిస్తున్న కళ్యాణ మండపాలను స్థానికులకు లీజుకి ఇవ్వడం జరుగుతోంది. అధికారులు కైకలూరులో కళ్యాణ మండపాన్ని పరిశీలిస్తారు.
3. లక్ష్మి – తిరుపూరు
ప్రశ్న – తిరుమలలో మరుగుదొడ్లలో పారిశుధ్యం బాగాలేదు.
ఈవో – మరుగుదొడ్లను మరింత బాగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటాం.
4. సుజాత – చెన్నై
ప్రశ్న- ఎస్వీబీసీలో శ్రీవారి సేవలు ఇప్పటికే రికార్డ్ చేసినవి ప్రసారం చేస్తున్నారు. ఆకర్షణీయంగా ఉండేలా కొత్త విజువల్స్ ప్రసారం చేయగలరు.
ఈవో – తిరుపతిలో శ్రీవారి నమూనా ఆలయం ఉన్నది. శ్రీవారి ఆలయంలో ఏ విధంగా అయితే స్వామివారి సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తారో, అదేవిధంగా నమూనా ఆలయంలో కూడా నిర్వహించి రికార్డ్ చేసినవి ప్రసారం చేస్తున్నాము. తాజా విజువల్స్ అందించే చర్యలు తీసుకుంటాము.
5. జయచంద్ర – బెంగుళూరు
ప్రశ్న – తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదము అన్న ప్రసాదము నాణ్యత బాగాలేదు.
ఈవో – ప్రతిరోజు శ్రీవారి లడ్డు ప్రసాదాలు, అన్నప్రసాదాలను తిరుమలలోని నాణ్యతా ప్రమాణాల ల్యాబ్ లో పరిశీలించడం జరుగుతుంది. అదే విధంగా నీటిని కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. మరింత రుచికరమైన, నాణ్యమైన లడ్డు ప్రసాదం, అన్న ప్రసాదం అందించేందుకు చర్యలు తీసుకుంటాం.
6. గంగాధరం – బెంగుళూరు
ప్రశ్న – తిరుమల శ్రీవారి ఆలయం మూసివేస్తారన్నారు నిజమేనా?
ఈవో- తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు, పూజలు ఉంటేనే భక్తులకు దర్శనం ఉండదు. ఆనంద నిలయం బంగారు తాపడం పనులు చేపడుతున్నందువల్ల ఈ వదంతులు వస్తున్నాయి. వీటిని నమ్మవద్దు.
7. భూపతి రెడ్డి – కరీంనగర్
శ్రీకాంత్ – మంచిర్యాల
ప్రశ్న – కరీంనగర్ లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 10 ఎకరాల స్థలం కేటాయించింది. ఈ స్థలాన్ని ఇస్కాన్ వారికి ఇస్తున్నారా
మంచిర్యాల లోని పురాతనమైన
శ్రీవారి ఆలయాన్ని పునరుద్ధరించడానికి ఆర్థిక సహాయం అందించండి.
ఈవో – కరీంనగర్ లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం 10 ఎకరాల భూమి కేటాయించింది. అక్కడ స్వామివారి ఆలయం నిర్మించాలని టీటీడీ బోర్డు తీర్మానించింది. ఆలయం టీటీడీ యే నిర్వహిస్తుంది .మంచిర్యాలలో శ్రీవారి ఆలయ పునరుద్ధరణకు శ్రీవాణి ట్రస్ట్ నుండి నిధులు అందించే ప్రయత్నం చేస్తాము.
8. మాధవి – విజయవాడ
ప్రశ్న – తిరుమలలో శ్రీవారి కల్యాణం చేయించాము. రెండు చిన్న లడ్లు మాత్రమే ఇచ్చారు. కళ్యాణోత్సవం లడ్డు, వడ ఇవ్వలేదు.
ఈవో – సేవల్లో పాల్గొన్న ,దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి ఒక లడ్డు అందిస్తున్నాం. పెద్ద లడ్డు, వడ రుసుము చెల్లించి తీసుకోవాలి. వడలు ఎక్కువ తయారు చేయించేందుకు ప్రయత్నిస్తున్నాము.
9. హేమంత్ విజయవాడ
ప్రశ్న – ఎస్వీబీసీ కార్యక్రమాలు చాలా బాగున్నాయి రోజుకు 10 గంటల పాటు వీక్షిస్తున్నాము. ప్రతిరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లో వివరాలు, తిధి, వార, నక్షత్రాలు చెప్తే బాగుంటది.
ఈవో -మరిన్ని మంచి కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.
10. శ్రీధర్ – బెంగుళూరు
ప్రశ్న – లడ్డు కౌంటర్లలో టీటీడీ ఉద్యోగస్తులు దూరుతున్నారు. కౌంటర్ల సంఖ్య పెంచండి?
ఈవో – ప్రస్తుతం తిరుమల లో 50 లడ్డు కౌంటర్లు పనిచేస్తున్నాయి ఇందులో రెండు కౌంటర్లు టీటీడీ ఉద్యోగులకు కేటాయించడం జరిగింది. త్వరలో మరో 25 కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము.
11. అరుణ – విశాఖపట్నం
ప్రశ్న – మా పాపకు అన్నప్రాసన చెవి పోగులు కుట్టుకోవడానికి తిరుమలలో ఏర్పాట్లు ఉన్నాయా?
ఈవో – కళ్యాణ వేదికలో చెవిపోగులు కుట్టుకునే అవకాశం ఉంది. అన్నప్రాసనకు మీరే ఏర్పాటు చేసుకోవాలి.
12. నరేష్ – నిజామాబాద్
ప్రశ్న – తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం చాలా బాగా ఉంది. అందుకు ప్రత్యామ్నాయంగా గాజు బాటిల్ ఇస్తున్నారు. స్వామివారి పేరుతో కాఫరు, గాజు, స్టీల్ బాటిల్లు టీటీడీ నే తయారు చేసి భక్తులకు అందించాలి.
ఈవో – తిరుమలలోని దుకాణాల వారు గాజు బాటిళ్లు అందిస్తున్నారు. తిరుమలలో దాతల సహకారంతో 150 జల ప్రసాదం కేంద్రాలను టీటీడీ ఏర్పాటు చేసింది.
13. శ్రీనివాసులు – కర్నూల్
ప్రశ్న – శ్రీవారి దర్శనం కోసం మా కుటుంబంలో కొందరికే రూ. 300 టికెట్లు ఆన్లైన్లో దొరికాయి.మరి కొంతమందికి దొరకలేదు. ఏదైనా అవకాశం ఉందా
ఈవో- ఆన్లైన్లో విడుదల చేసిన కోటా పూర్తయింది. తిరుపతిలో ఉచితంగా దర్శనానికి వెళ్లేందుకు ఎస్ ఎస్ డి టోకెన్లు ప్రతిరోజు ఇస్తున్నాము. ఇవి తీసుకుని వారికి కేటాయించిన సమయానికి దర్శనానికి వెళ్లొచ్చు . అలా కాకుండా టోకెన్ లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా సర్వదర్శనానికి వెళ్లవచ్చు. ఇక్కడ వేచి ఉండి వారి వంతు వచ్చాకే దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది.
14. నరసింహ శాస్త్రి- విజయవాడ
ప్రశ్న – ఎస్వీబీసీ లో గరుడ పురాణం చాలా బాగుంది. పరకామణి సేవ చేయడానికి అవకాశం కల్పించండి.
ఈవో – ఇంకా మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తాము. పరకామణికి
మీ సేవలను వినియోగించుకుంటాం.
15. పరమేశ్వర్ – బెంగళూరు
ప్రశ్న – జనవరి రెండో తేదీ శ్రీ వాణి టికెట్టు ద్వారా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నాము. కానీ మాధవంలో వసతి అడిగితే తిరుమలలో తీసుకోవాలని అన్నారు. తిరుమలకు వచ్చి సిఆర్వోలో అడిగితే పద్మావతికి వెళ్ళమన్నారు, పద్మావతి విచారణ కేంద్రంలో అడిగితే అమర్యాదగా మాట్లాడారు. అదేవిధంగా తిరుచానూరు అమ్మవారి దర్శనం కోసం రూ.500 రూపాయలు వేదఆశీర్వాదం టికెట్ అడిగితే అక్కడ సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించారు.
ఈవో – ఆ సమయంలో సిసి టీవీ ఫుటేజ్ పరిశీలించి ఆ ప్రాంతాల్లో విధులు నిర్వహించిన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటాం.
16. విజయలక్ష్మి -చుండూరు
ప్రశ్న – ప్రతిరోజూ శ్రీవారి కల్యాణం చివరిలో హారతి తలంబ్రాల సమయంలో మంత్రాలు కాకుండా అన్నమాచార్య సంకీర్తనలు ప్రసారం చేస్తున్నారు. మంత్రాలు ప్రసారం చేయండి. ప్రవచనాలను అన్ని టీటీడీ అనుబంధాలయాల్లో వినిపించండి.
ఈవో – అర్చకులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం. ప్రవచనాలు ఎస్ వి బి సి లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాము యూట్యూబ్, ఇతర ప్రసార మాధ్యమాల్లో కూడా వీక్షించవచ్చు.
17. నాగేశ్వరరావు – గుడివాడ
ప్రశ్న – సాధారణ భక్తులకు 20 గంటలకు పైగా దర్శన సమయం పడుతోంది.వేచి ఉండే సమయం తగ్గించండి.
ఈవో – సామాన్య భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో ఎస్ఎస్ డి టోకెన్లను అందిస్తున్నాము. వేచి ఉండే సమయం తగ్గించడానికి ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నాము . అదేవిధంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్లైన్ లో అందుబాటులో ఉంచాము.
18. మధుసూదన్ – రాజమండ్రి
ప్రశ్న – ఫిబ్రవరి నెల శ్రీవారి సేవా టికెట్లు విడుదల చేయలేదు, కానీ వసతిని విడుదల చేశారు. మేము ఏ విధంగా బుక్ చేసుకోవాలి?
ఈవో – రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, సేవా టికెట్లు, దర్శనం టికెట్లు, వసతి ఒకేసారి విడుదల చేసేలా చర్యలు తీసుకుంటాం.
Tags:The rent of rooms allotted to common devotees has not been increased
