Natyam ad

ఆర్జిత సేవలు, హోటళ్లపై..సుబ్బారెడ్డి యూ టర్న్.

తిరుమల ముచ్చట్లు:
‘తిరుమలలో ప్రైవేట్ హొటళ్లకు అనుమతి రద్దు..’, ‘శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ ధరల పెంపు’ కొద్ది రోజుల క్రితం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులను బాగా ఇబ్బంది పెట్టిన టీటీడీ నిర్ణయాలివి. కొద్ది రోజుల క్రితం తిరుమలలో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారని మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల నుంచి ఒక్కసారిగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. నిర్ణయించిందే తడవు అన్నట్లు కొండమీద ప్రైవేట్ హొటళ్లను మూసేయాలని అధికారులు హుకుం జారీ చేయడం భక్తుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. ఈ రెండు నిర్ణయాలపైనా భక్తుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు, ప్రతిఘటన ఎదురవడంతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తోకముడవక తప్పలేదు. ఆ రెండు అంశాలపైన బోర్డు సమావేశంలో చర్చ జరిగింది కానీ.. అమలుకు నిర్ణయం తీసుకోలేదంటూ ఇప్పడు సన్నాయి నొక్కులు నొక్కడం విశేషం.తిరుమల కొండపై దశాబ్దాలుగా తాము చేస్తున్న హొటల్ వ్యాపారాన్ని అకస్మాత్తుగా మూసేయాలంటే.. తమ జీవితాలు రోడ్డున పడతాయంటూ వ్యాపారులు గగ్గోలు పెట్టారు. హొటళ్లు మూసేయడంతో తిరుమలకు తరలి వచ్చే లక్షలాది మంది శ్రీవారి భక్తులు అన్నమో రామచంద్రా అంటూ ఆర్తనాదాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తుల్లో వృద్ధులు, బాలింతలు, పిల్లలు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు. దేవుని దర్శనానికి వచ్చే చక్కెర వ్యాధిగ్రస్తులకు సకాలంలో ఆహారం దొరక్కపోతే వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. అలాగే పిల్లలకు పాలు దొరక్కపోతే ఆకలితో అలమటించిపోతారు. సాధారణ భక్తులు కూడా అల్పాహారం లేకపోతే తీవ్ర ఇబ్బందులు పడతారు. కొండపై హొటళ్లు లేకపోతే ఇలాంటి కష్టాలన్నీ భక్తులకు ఎదురవుతాయని పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అయింది.అలాగే.. శ్రీవారి ఆర్జిత సేవల ధరలు పెంచుతున్నట్లు.. అది కూడా రెండు నుంచి ఐదు రెట్ల వరకూ ధరలు పెంచాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించినట్లు పెంచాలని నిర్ణయించిన ధరల పట్టికలతో పాటుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నిర్ణయాన్ని కూడా భారీ సంఖ్యలో భక్తులు వ్యతిరేకిస్తుండడం గమనార్హం. ఈ రెండు అంశాలపైనా చర్చ మాత్రమే జరిగిందని, తిరుమలలో శ్రీవారికి జరిగే ఏ ఆర్జిత సేవల ధరలను పెంచే ఉద్దేశం లేదని స్పష్టం చేయడం విశేషం. అలాగే.. తిరుమలలో ప్రైవేట్ హొటళ్ల మూసివేత నిర్ణయంపై ఆయన స్పందిస్తూ..  స్వామి దర్శనానికి ఎంత మంది భక్తులు వచ్చనా అన్నప్రసాదం విషయంలో ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటామని వివరణ ఇచ్చారు. శ్రీవారి భక్తులందరికీ ఉచితంగా అన్నప్రసాదం అందించాలని ఆలోచన మాత్రమే చేశామన్నారు. ఆ ఆలోచనను ఇప్పటికి ఇప్పుడు అమలు చేయలేమని చెప్పడం విశేషం.తిరుమలలో ప్రైవేటు హొటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు యధావిధిగా కొనసాగుతాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పడం వెనుక భక్తుల ఆగ్రహానికి భయపడినట్లే ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తిరుమలలో ఎవ్వరికీ ఇబ్బంది లేని విధంగా హొటళ్ల తొలగింపుపై నిర్ణయం తీసుకుంటామంటూ కాస్త మేకపోతు గాంభీర్యాన్ని కూడా ఆయన ప్రదర్శించారు.శ్రీవారి ఆర్జిత సేవలను ఏప్రిల్ 1 నుంచి పునరుద్ధరిస్తామని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా నిలిచిపోయిన సర్వదర్శనాన్ని వారం రోజుల క్రితమే  ప్రారంభించామన్నారు. దాంతో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే స్వామివారి భక్తుల కోసం త్వరలో చపాతీలు, రొట్టెలను అన్న ప్రసాదంలో అందిస్తామని చెప్పారు. తిరుమలలో మరో రెండు చోట్ల అన్న ప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలి
పారు. తిరుమలలో శుక్రవారంనాడు అన్న ప్రసాద భవనం కమాండ్ కంట్రోల్ ను పరిశీలించిన సందర్భంగా సుబ్బారెడ్డి ప్రైవేట్ హొటళ్లు, రెస్టారెంట్లు యధాతధంగా కొనసాగుతున్నాయి.
 
Tags:Acquired services, on hotels..Subbareddy You Turn