Natyam ad

ప్రణాళిక ప్రకారం శ్రమిస్తే విద్యార్థినులు అద్భుతాలు సృష్టించవచ్చు

– శ్రీ పద్మావతి మహిళ డిగ్రీ, పిజి కళాశాల 70వ వార్షికోత్సవ వేడుకల్లో జెఈవో   సదా భార్గవి

తమకిష్టమైన రంగాలలో లక్ష్యాలు నిర్ణయించుకుని, ప్రణాళిక ప్రకారం శ్రమిస్తే విద్యార్థినులు అద్భుతాలు సృష్టించవచ్చునని టీటీడీ జెఈవో  సదా భార్గవి అన్నారు.

 

తిరుపతి ముచ్చట్లు:

Post Midle

శ్రీ పద్మావతి మహిళ డిగ్రీ మరియు పిజి కళాశాల 70వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి   సదా భార్గవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకుపోవడంతో పాటు, విద్యను ప్రోత్సహిస్తున్న ఏకైక సంస్థ టీటీడీ మాత్రమేనని జెఈవో చెప్పారు. శ్రీ పద్మావతి మహిళ డిగ్రీ మరియుపిజి కళాశాల ఇటీవల కాలంలో ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. ఇందులో కళాశాలలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కృషి దాగి ఉందని ఆమె చెప్పారు. కళాశాలకు న్యాక్ ఎ ప్లస్ గుర్తింపు రావడానికి కృషి చేసిన అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులను ఆమె అభినందించారు.

 

 

విద్యను స్వామివారు ఇస్తున్న మహా ప్రసాదంగా భావించి చక్కగా చదువుకోవాలని పిలుపునిచ్చారు. విద్య వ్యాపారం కారాదని, విజ్ఞానాన్ని అందించే మార్గంగా మాత్రమే ఉండాలని ఆమె ఆకాంక్షించారు. విద్య కేవలం ఉద్యోగం కోసమే కాదని, జ్ఞానానికి ఉద్యోగానికి సంబంధం లేదని ఆమె చెప్పారు. ప్రస్తుత సమాజంలో మహిళ విద్యను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. విద్యార్థులకు మంచి విద్యను అందించడానికి టీటీడీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. టీటీడీ విద్యా సంస్థల నుంచి వెళ్లిన విద్యార్థులకు ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు వచ్చేలా ఉండాలన్నారు. మంచి వాతావరణం, వసతులు, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో మహిళా కళాశాల దినదినాభివృద్ధి చెందుతోందని ఆమె తెలిపారు. కళాశాలను ఇంకా ఎలా అభివృద్ధి వైపు తీసుకుపోవాలని ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలన్నారు. తెలుగు మన మాతృ భాష అని, దాన్ని గౌరవించుకుంటూ కాపాడుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు నిత్య విద్యార్థి గా ఉండాలని, రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే జీవితంలో ఉన్నత స్థానాలు అందుకోవాలని పిలుపునిచ్చారు.

 

 

 

 

మరో అతిథిగా విచ్చేసిన ఎస్ వి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మహమ్మద్ హుసేన్ మాట్లాడుతూ, కళాశాలకు న్యాక్ ఎ ప్లస్ గుర్తింపు రావడం గర్వకారణమని చెప్పారు.
దేశ భవిష్యత్తు, సమాజ అభివృద్ధి కోసం విద్యార్థినులు నిరంతరం శ్రమించాలన్నారు. అవరోధాలను కూడా అనుకూల అంశాలుగా మలచుకుని అభివృద్ధి వైపు సాగాలన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదట ఏర్పాటుచేసిన తక్షశిల విశ్వవిద్యాలయం భారత దేశంలోనే ఉందని చెప్పారు. ప్రపంచంలోని విశ్వవిద్యాలయాలకు ఈ విశ్వవిద్యాలయం మార్గదర్శి అని ఆయన చెప్పారు. వేదిక్ సైన్స్ లో వేల సంవత్సరాల క్రితమే నానో టెక్నాలజి, విమానాలు, బ్రహ్మాస్త్రాల గురించి చెప్పారని, సూర్యుడి నుంచి భూమికి ఉన్న దూరం కూడా తెలియజేశారన్నారు.
స్వామి వివేకానంద మాటలను స్ఫూర్తిగా తీసుకుని కష్టపడి చదివి లక్ష్యాలను నెరవేర్చుకోవాలని విద్యార్థినులకు పిలుపునిచ్చారు.

 

 

 

టీటీడీ విద్యాశాఖాధికారి
గోవింద రాజన్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహదేవమ్మ, ప్రొఫెసర్ భువనేశ్వరిదేవి, కళాశాల కౌన్సిల్ అధ్యక్షురాలు కుమారి అంజుమన్ రెహమాన్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.కళాశాల అధ్యాపకులు జెఈవో   సదా భార్గవి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మహమ్మద్ హుస్సేన్, డిఈవో   గోవిందరాజన్ ను శాలువతో సన్మానించారు. అనంతరం కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

 

Tags: Students can create miracles if they work according to the plan

Post Midle