ఖమ్మంలో తమిళనాడు ఎక్స్ ప్రెస్ కు హాల్ట్- ఎంపీ వద్దిరాజు వినతికి స్పందన

ఖమ్మం  ముచ్చట్లు:

ఖమ్మం నుంచి తమిళనాడు వెళ్లే ప్రయాణికుల చిరకాల కోరిక నెరవేరింది. న్యూఢిల్లీ నుంచి మద్రాస్ వరకు నడిచే తమిళనాడు ఎక్స్ ప్రెస్ కు ఖమ్మం రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. ఈ మేరకు రైల్వే ఉన్నతాధికారుల నుంచి సంబంధిత స్టేషన్ల కు ఉత్తర్వులు అందాయి. ఇప్పటి వరకు ఈ ట్రైన్ కు కేవలం విజయవాడ, వరంగల్ లో మాత్రమే హాల్టింగ్ ఉండేది. తాజాగా ఖమ్మం స్టేషన్ లో కూడా హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. సోమవారం నుంచే ఈ సదుపాయం అమల్లోకి వచ్చింది. ఇటీవల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఖమ్మంలో పలు రైళ్లు ఆపాలని కోరుతూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు వినతిపత్రం అందజేశారు. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రానైట్, ఇతర పరిశ్రమల్లో తమిళనాడు కు చెందిన కార్మికులు అధిక సంఖ్యలో పని చేస్తుంటారని, వీరు తమ గమ్యస్థానాలకు వెళ్లే క్రమంలో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఎంపీ రవిచంద్ర కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ సందర్భంలో మంత్రి ఇచ్చిన హామీ మేరకు తమిళనాడు ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఇకపై ఖమ్మం లో ఆగనుంది.

 

Tags: Halt to Tamil Nadu Express in Khammam – Response to MP Vaviraju’s complaint

Post Midle
Post Midle