మండిపడుతున్న టీడీపీ నేతలు.
అమరావతి ముచ్చట్లు:
తెలుగు రాష్ట్రాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వెనుక నారాయణ, చైతన్య విద్యాసంస్థల ప్రమేయం ఉందంటూ ఇటీవల ఏపీ సీఎం జగన్ బహిరంగంగానే వ్యాఖ్యానించిన నేపథ్యంలో నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ కొండాపూర్‌కు వచ్చి నారాయణను చిత్తూరు పోలీసులు తీసుకెళ్లారు. మాజీ మంత్రి నారాయణ వెంట ఆయన భార్య రమాదేవి ఉన్నారు. మరోవైపు టెంత్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో బాధ్యులైన వారిని వదిలిపెట్టేది లేదు, కుట్ర పన్ని ఈ వ్యవహారం నడిపారు. ఎన్ని డ్రామాలు చేసినా క్షమించేది లేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.
నారాయణ అరెస్టును ఖండిస్తున్నాం:కళా వెంకట రావు
నారాయణ అరెస్టు విషయంలో రాజకీయ కక్షతో చేసిన అరెస్టు తప్పా కారణం చెప్పే పరిస్థితి లేదు. ప్రజలందరూ అర్ధం చేసుకుని తిరగబడే రోజు వస్తుంది.జిల్లా పార్టీ తరపున నారాయణ అరెస్టును ఖండిస్తున్నాం. గత మూడేళ్ళుగా జగన్, సజ్జల్ ప్రస్టేషన్ లోకి వెళ్లిపోయారు. సజ్జల, జగన్ మానసికంగా బాధపడుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి పక్షాలు మాట్లాడితే వాటిలో మంచిని తీస్కుంటారు. చెడును విడిచి పెడతారు. తప్పుడు కేసులు పెట్టడం, భయాందోళనకు గురి చేయడం, అరెస్టులు చేయడం చేస్తున్నారు. అసెంబ్లీని కూడా కౌరవ సభ చేసేసారు
ఇది అధికార దుర్వినియోగమే :అశోక్ గజపతి రాజు
నారాయణ అరెస్టుపై స్పందించారు మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు. టీడీపీ నాయకులు కేసులు పెట్టారు… పెడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. నా పైన కేసులు పెట్టారు. కళా వెంకట రావుపైన కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఒక్క టీడీపీ నాయకులు పైనే కాకుండా 150 కి పైగా దేవాలయాల పైన దాడులు జరిగాయి. వైసీపీ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోంది. ఇది ఒక రెడీక్లాస్ ప్రభుత్వం. ప్రజా హితం కోసం కాకుండా అధికార దుర్వినియోగం కోసం పని చేస్తున్నారు. మూడు రాజధానుల విషయంలో వికేంద్రీకరణ అనే కొత్త పదాన్ని తీసుకువచ్చారు
అక్రమ అరెస్టులతో విద్యార్ధులకు మేలు జరగదు: నారా లోకేష్
చేతగానితనాన్ని ఇతరులపైకి నెట్టేయడం.. చేసిన నేరాలు, అక్రమాలకు ఇతరుల్ని బాధ్యులని చెయ్యడం జగన్ అండ్ కో ట్రేడ్ మార్క్. పదో తరగతి పేపర్ లీక్ ఘటనలపై మంత్రి బొత్స, సిఎం జగన్ విరుద్ధ ప్రకటనలు ప్రజలంతా చూసారు. ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడంతో పాటు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నారాయణపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారు. సంబంధం లేని కేసులో నారాయణ దంపతులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పేపర్ లీకేజ్ ఘటనల్లో అసలు సూత్రధారులైన వైసీపీ నేతల్ని వదిలేసి టీడీపీ నేతల్ని అరెస్ట్ చేయించి సైకో ఆనందం పొందుతున్నారు. ఈ అక్రమ అరెస్టుల వల్ల పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎటువంటి మేలు జరగదు.

ఇది కక్ష సాధింపే: అచ్చెన్నాయుడు
కక్ష్య సాధింపుల్లో భాగంగానే టీడీపీ నేత నారాయణను ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్ తన అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే ఈ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. మూడేళ్ల పాలనలో కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యతిచ్చి టీడీపీ నేతలను అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.
ఇది రాజకీయ కుట్ర: ప్రత్తిపాటి పుల్లారావు
ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ ని ఖండిస్తున్నాం. ప్రశ్నాపత్రాల లీకేజీయే జరగలేదని స్వయాన మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ అరెస్ట్ రాజకీయకుట్రతో జరిగింది. వైసీపీ క్షేత్రస్థాయిలో బలహీనపడుతోంది. టీడీపీ నేతలపై అక్రమకేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్న నారాయణ పేరుని పాడుచేయాలని చూస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి నారాయణ విద్యాసంస్థల్ని బలహీనపరిస్తే విద్యార్ధులు నష్టపోతారు. నారాయణను వెంటనే విడుదలచేయాలి.
ఈ అరెస్ట్ వెనుక జగన్ కుట్ర: బుద్దా వెంకన్న
పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకుందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ఆ పాపాన్ని నారాయణపై నెట్టేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. నారాయణ అరెస్ట్ వెనుక జగన్ కుట్ర ఉందన్నారు. ఈ ప్రభుత్వంతో తాడో.. పేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. అక్రమ అరెస్టులకు తాము భయపడమన్నారు.
విద్యామంత్రిని అరెస్ట్ చేయాలి: సోమిరెడ్డి
టెన్త్ ప్రశ్నాపత్రాల లీక్ కేసులో ప్రభుత్వ టీచర్లను అరెస్ట్ చేసినప్పుడు విద్యాశాఖ మంత్రి బొత్సను ఎందుకు అరెస్ట్ చేయరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి ప్రశ్నించారు. పేపర్ లీక్ వ్యవహారంలో ప్రభుత్వం పరువు పోయిందని.. అందుకే ఇప్పుడు ఎదుటివాళ్లపై బురదజల్లుతోందని ఆయన ఆరోపించారు. నారాయణ విద్యా సంస్థలంటే అంత తేలిగ్గా ఉందా అంటూ నిలదీశారు. రాజకీయాల్లోకి వచ్చాక నారాయణ తన విద్యా సంస్థల నిర్వహణ నుంచి తప్పుకున్నారని వివరించారు.
ఏది జరిగినా మేమే కారణమా? చెంగల్రాయుడు
జగన్ ప్రభుత్వం కావాలనే ఏదో ఒక సాకుతో టీడీపీ నేతలను అరెస్ట్ చేయిస్తోందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు ఆరోపించారు. జగన్ ఇంట్లో గ్యాస్ లీకైనా.. పరీక్షల్లో పేపర్ లీకైనా దానికి టీడీపీనే కారణమంటే ఎలా అని ప్రశ్నించారు.
Tags:TDP leaders on fire
