వరంగల్ నుంచి మాజీ మావోయిస్టు
అదృష్టం పరీక్షించుకుంటున్న నేత
వరంగల్ ముచ్చట్లు:

అసెంబ్లీ ఎన్నికల సమరానికి సిద్ధమైంది తెలంగాణ. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రావటంతో…. అధికారికంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైపోయిన సంగతి తెలిసిందే. దీంతో మొన్నటి వరకు ఓ లెక్క… ఇక నుంచి మరోలెక్క అన్నట్లు తెలంగాణ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ముచ్చటగా మూడోసారి గెలిచి… హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చూస్తుంటే… ఎలాగైనా ఈసారి పవర్ లోకి రావాలని కాంగ్రెస్ కసితో ఉంది. రెండు పార్టీలకు కాకుండా… తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ అడుగుతోంది. ప్రజలను ఆలోచనలో పడేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా… త్వరలోనే కాంగ్రెస్ జాబితా రాబోతుంది. అయితే అభ్యర్థుల ఎంపికలో లోతుగా కసరత్తు చేస్తోంది హస్తం పార్టీ. ఇప్పటికే కీలకమైన స్థానాలపై లీక్స్ బయటకి వస్తుండగా… ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ నియోజకవర్గానికి సంంబంధించి సరికొత్త పేరు తెరపైకి రావటం ఆసక్తికరంగా మారింది. అభ్యర్థులు రేసులో ఆయన పేరును హైకమాండ్ కూడా లోతుగా పరిశీలిస్తుందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో… ఆ నియోజకవర్గంలోని రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది.గాజర్ల అశోక్ అలియాస్ ఐతు…. ఇయన మాజీ మావోయిస్టు. రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పని చేయటంతో పాటు మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పని చేశారు. రెండు దశాబాద్ధాల పాటు ఉద్యమంలో పని చేసిన అశోక్…. 2016లో జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.
అయితే ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో…. అశోక్ పేరు తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ తరపున పరకాల అసెంబ్లీ బరిలో నిలవనున్నట్టు తెలుస్తోంది. ఆ దిశగా అశోక్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట! ఇదే విషయాన్ని కూడా ఓ మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు అశోక్. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రజలను పీడిస్తున్నాయని… కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో… అశోక్ వేస్తున్న అడుగులు ఆసక్తికరంగా మారాయి.పరకాల నియోజకవర్గం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోకి వస్తోంది. రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు ఇది కాంగ్రెస్ అడ్డాగా ఉండేది. ఇక్కడ్నుంచి కొండా ఫ్యామిలీ ప్రాతినిధ్యం వహించింది. ఉద్యమ సమయంలో వచ్చిన ఉపఎన్నికల్లో అనూహ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. ఇక 2014, 2018 ఎన్నికల్లోనూ కారు పార్టీ పాగా వేసింది. 2014లో పరకాల నుంచి కాకుండా… వరంగల్ తూర్పు నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచారు కొండా సురేఖ. దీంతో వారి రాజకీయం పరకాల నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గానికి షిఫ్ట్ అయింది. కానీ బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన సురేఖ… 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పరకాల నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు సురేఖ. అయితే ఈ ఎన్నికల్లో వరంగల్ తూర్పుతో పాటు పరకాల టికెట్ కూడా తమకే ఇవ్వాలని సురేఖ కుటుంబం కోరుతోంది. తూర్పు నుంచి సురేఖ, పరకాల నుంచి మురళీ బరిలో ఉండేలా అడుగులు వేస్తున్నారు.
అయితే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఇనగాల వెంకట్రామిరెడ్డి కూడా తనకే పరకాల టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే కొండా కుటుంబానికి రెండు టికెట్లు ఇస్తే…. ఆయా నియోజకవర్గాల్లో సమన్వయం చేసే విషయంలో ఇబ్బందులు రావొచ్చని, అలా కాకుండా ఒక టికెట్ ఇస్తే విజయంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించే అవకాశం ఉంటుందని హైకమాండ్ భావిస్తుందట! మరోవైపు ఇనుగాలను ఒప్పించాలని… బీసీ సామాజికవర్గానికి చెందిన అశోక్ పేరును అభ్యర్థిగా పరిశీలిస్తుందట కాంగ్రెస్..!నియోజకవర్గంలో అశోక్ కు మంచి పరిచయాలు ఉండటంతో పాటు… బీసీ సామాజికవర్గానికి టికెట్ ఇచ్చినట్లు అవుతుందనే విషయంపై కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందనే చర్చ వినిపిస్తోంది. దీనికితోడు అశోక్ కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తుపై పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెప్పటం ఆసక్తికరంగా మారింది. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే… కాంగ్రెస్ నుంచి అధికారికంగా జాబితా రావాల్సిందే….!
వరంగల్ జిల్లా చిట్యాల మండలం వెలిశాలకు చెందిన అశోక్ మావోయిస్టు పార్టీలో కీలక నేతగా పని చేశారు. ఈయన సోదరుడు గాజర్ల గణేష్ మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా పని చేశారు. వైఎస్ఆర్ హయంలో కాంగ్రెస్ ప్రభుత్వం-మావోయిస్టులకు మధ్య చర్చలు జరిగినప్పుడు గణేష్ మావోయిస్టుల తరపున చర్చల ప్రతినిధిగా హాజరయ్యారు. మరో సోదరుడు సారయ్య ఎన్ కౌంటర్లో చనిపోయాడు. అశోక్ భార్య ఉమా దండకారణ్యంలో ఆయనతో పాటు పని చేసి 2012లో లొంగిపోయింది. అశోక్‌పై ప్రభుత్వం రూ.20 లక్షల రివార్డు ప్రకటించింది. కానీ అనారోగ్య కారణాలతో అశోక్… 2016లో పోలీసులకు లొంగిపోయాడు.
Tags: Former Maoist from Warangal
